ఆహ్వానిస్తేనే వెళ్లాను: విజయ్ మాల్యా ట్వీట్
లండన్: పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానిస్తేనే వెళ్లాలని, అంతేకాని అక్రమంగా సభలోకి చొరబడలేదని కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యా స్పష్టం చేశారు. బ్రిటన్‌లో భారత రాయబారి నవ్‌తేజ్ సర్ణ హాజరైన గత గురువారం నాటి పుస్తకావిష్కరణ సభకు భారత కోర్టు దోషిగా నిర్ధారించిన విజయ్ మాల్యా హాజరు కావడం కలకలం సృష్టించింది. ఆహ్వానితుల జాబితాలో విజయ్ మాల్యా పేరులేదని శనివారం విదేశీ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
అయితే తన జీవితంలో ఎన్నడూ అక్రమంగా అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోనని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు. ఏ పుస్తకం కోసం అయితే ఆవిష్కరణ సభ జరిగిందో ఆ పుస్తకాన్ని రాసింది తన మిత్రుడైనందున, ఆయన కోసం ఆ సభకు వెళ్లానని మాల్యా చెప్పారు. తగిన సాక్ష్యం లేదని, చార్జ్‌షీట్ లేదని. తనకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకునే అవకాశం కూడా తనకు ఇవ్వలేదని, ఇది అత్యంత అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుహెల్ సేథ్ రాసిన కొత్త పుస్తకావిష్కరణ సభను గత గురువారం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నిర్వహించింది.