
ఈ బ్యాంకులున్నాయే..
న్యూఢిల్లీ : ఆర్ధిక సమస్యలతో కేఫ్ కాఫీడే వ్యవస్ధాపకుడు వీజీ సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతంపై లిక్కర్ కింగ్, రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా స్పందించారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన బ్రిలియంట్ ఎంట్రపెన్యూర్ సిద్ధార్థకు ఎదురైన పరిస్ధితులే తాను అనుభవిస్తున్నానని మాల్యా పోల్చుకున్నారు. సిద్ధార్ధ తనను ఐటీ అధికారులు వేధిస్తున్నారని రాసిన లేఖను చూసి తాను దిగ్భ్రమకు లోనయ్యానని, తనదీ సిద్ధార్ధ పరిస్ధితేనని వ్యాఖ్యానించారు.
బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు ఎవరినైనా నిస్సహాయులను చేస్తాయని, తన పట్లా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలను పూర్తిగా చెల్లిస్తానని తాను ముందుకొచ్చినా వేధిస్తున్నారని మాల్యా ట్వీట్ చేశారు. కాగా ఆర్థిక సమస్యలతో అదృశ్యమైన పారిశ్రామికవేత్త వీజీ సిద్ధార్ధ మృతదేహం మంగుళూర్ సమీపంలోని నేత్రావతి నది వద్ద బయటపడిన సంగతి తెలిసిందే.