నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు
యూపీఏ, ఎన్డీయేలపై మాల్యా ట్వీట్లు
న్యూఢిల్లీ: రుణాల ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాజాగా ఎగవేతదారులపై ప్రభుత్వ కఠిన చర్యల మీద స్పందించారు. భీకరంగా పోట్లాడుకుంటున్న యూపీఏ, ఎన్డీయే కూటములు తనను ఫుట్‌బాల్‌లాగా ఆడుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. ఇందుకు మీడియా వేదికగా మారిందంటూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్వీటర్‌లో ట్వీట్ చేశారు. ‘ఎన్‌డీఏ వర్సెస్ యూపీఏ పోటీ నడుస్తోంది. రెండు జట్లు హోరాహోరీగా ఆడుతున్నాయి. మీడియాను చక్కగా పిచ్‌లాగా వాడుకుంటున్నారు. నన్ను ఫుట్‌బాల్‌లాగా ఆడుకుంటున్నారు. దురదృష్టవశాత్తు.. ఈ మ్యాచ్‌లో రిఫరీలే లేరు’ అంటూ మాల్యా పేర్కొన్నారు.
రుణాలు ఎగవేసిన వారు దేశం విడిచి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఆయన ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు తన కేసులో సీబీఐ తీరుపై కూడా మాల్యా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీబీఐ ఆరోపణలు షాకింగ్‌గా ఉన్నాయి. అన్నీ అబద్ధాలు, అపోహలే. ఉన్నత స్థాయిలో ఉన్నవారైనా కూడా వ్యాపారం, ఆర్థికాంశాల గురించి పోలీసులకేం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. మాల్యాకి చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 9,000 కోట్లు బ్యాంకులకు ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో మాల్యా గతేడాది మార్చి 2న బ్రిటన్‌కు పరారయ్యారు.