షేర్ల విలువేమీ తక్కువగా లేదు!
ఏంజిల్ బ్రోకింగ్ సీఈఓ వినయ్ అగర్వాల్
మార్కెట్ల విలువ సంతృప్త స్థాయిలోనే ఉంది
⇒ ‘యూపీ’తో ర్యాలీ చేసినా... నిలదొక్కుకోవాలి
⇒ అందుకు కంపెనీల రాబడులు తోడవ్వాల్సి ఉంది
⇒ టెక్నాలజీతో మార్కెట్ల పరిస్థితి మారుతుంది
⇒ మా దగ్గర గంటలో ఖాతా తెరిచి ట్రేడింగ్ కూడా చెయ్యొచ్చు
(హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో)
యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరూ ఊహించనంత మెజారిటీని బీజేపీ సొంతం చేసుకుంది. ఇంతటి సునామీని నిజానికి మార్కెట్లు కూడా ఊహించలేదు. దీంతో మంగళవారం భారీ ర్యాలీ ఉండవచ్చనేది నిపుణుల అంచనా. అయితే... మార్కెట్లు ఇప్పటికే విలువ పరంగా ఒకవిధమైన గరిష్ఠ స్థాయిలో ఉన్నాయనేది బ్రోకరేజీ సంస్థ ఏంజిల్ బ్రోకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) వినయ్ అగర్వాల్ అభిప్రాయం. కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడి... వాటి రాబడులు పెరిగితే అప్పుడు మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఒకరకంగా యూపీ ఫలితాలతో మార్కెట్లు ర్యాలీ చేసినా... మళ్లీ దిగువకు పయనించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యాంశాలివీ...
► యూపీ ఫలితాలతో మార్కెట్లు ఎలా ఉండొచ్చు?
నిజానికి యూపీలో బీజేపీ గెలుస్తుందన్న విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. కాకపోతే ఈ స్థాయి విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. కాబట్టి కొంత ర్యాలీ ఉంటుంది.
► ఈ ర్యాలీ ఏ మేరకు ఉండొచ్చు?
అది చెప్పలేం. ఎందుకంటే మన మార్కెట్లు విలువ పరంగా ఇప్పటికే సంతృప్త స్థాయిల వద్ద ఉన్నాయి. ఒకవేళ ఇంకా బాగా పెరిగాయనుకోండి. అమెరికా మార్కెట్ల మాదిరి మన ఇన్వెస్టర్లలోనూ భయాలు మొదలవుతాయి. ఎందుకంటే మార్కెట్లు కంపెనీల రాబడులకు తగ్గట్టే ఉండాలి. లేదంటే ఎ ప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన తప్పదు.
► మీరు అడ్వయిజరీ సేవలందిస్తున్నారా?
► మీ ఫండ్ రాబడి ఎలా ఉండొచ్చు?
చిన్న ఇన్వెస్టర్లకు అడ్వయిజరీ సేవలందించటమే మా ప్రత్యేకత. మా సంస్థను దినేష్ ఠక్కర్ ఏర్పాటు చేసింది కూడా ఆ ఉద్దేశంతోనే. చిన్న ఇన్వెస్టర్లకు సరైన అడ్వయిజరీ సేవలందటం లేదని, వారు మార్కెట్లో నష్టపోతున్నారని గ్రహించబట్టే ఆయన ఈ సేవల్ని ఆరంభించారు. ఇక మా మ్యూచ్‌వల్ ఫండ్ గడిచిన మూడేళ్లుగా 15% రాబడినందిస్తోంది. వచ్చే రెండేళ్లూ 12–15% మధ్య రాబడి ఉండొచ్చు.
► విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వ్యాలీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు కదా? లాభమేమైనా ఉందా?
చిన్న సంస్థలను ప్రోత్సహించే ఈవెంట్లలో మేం కేపీఎంజీ భాగస్వామిగా ఉన్నాం. అందు లో భాగంగానే హాజరయ్యా. టెక్నాలజీతో మార్కె ట్ల స్థితిగతుల్ని కూడా మార్చేయొచ్చన్నది నా అభిప్రాయం.
► టెక్నాలజీ పరంగా ముందుండటానికి మీరేం చేస్తున్నారు?
ఇప్పటికే ఖాతా ఓపెనింగ్‌లో టెక్నాలజీని వాడుతున్నాం. అందరికన్నా ముందే ఆధార్‌ను యాక్సెస్ చేసుకున్నాం. దానిద్వారా గంటలో ట్రేడింగ్ ఖాతా తెరవటమే కాక, ట్రేడింగ్ చేసుకునే అవకాశమిస్తున్నాం. ఇంకా రోబో అడ్వయిజరీ సేవల్ని ఆరంభించాం. ఇది కస్టమర్ స్థితిగతుల్ని అర్థం చేసుకుని మరీ సలహాలిస్తుంది. అలొకేషన్‌ను విశ్లేషించటం, గత పెట్టుబడుల్ని ట్రాక్ చేయటం... అన్నీ చేస్తుంది.
► ఫిన్‌టెక్‌తో క్యాపిటల్ మార్కెట్లలో రాబోయే మార్పులేంటి?
ఫిన్‌టెక్ వల్ల కస్టమర్ల గుర్తింపు తేలికవుతుంది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలాంటి మధ్యవర్తి లేకుండా వ్యక్తి నుంచి వ్యక్తికి నగదు బదిలీ చేయటం వల్ల నిధులు క్షణాల్లో బదిలీ అవుతాయి. విశ్వాసం పెరుగుతుంది. ఇక మార్కెట్లలో సెటిల్‌మెంట్లు కూడా రియల్‌టైమ్‌లో జరుగుతాయి. ఇవన్నీ ఫిన్‌టెక్‌తోనే సాధ్యమని నా నమ్మకం.