ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ఉత్పత్తి, అమ్మకాల్లో మంచి ప్రతిభ కనబరచింది. ఏప్రిల్, మే నెలల్లో రూ.395 కోట్లు విలువ గల ఉత్పత్తులు ఎగుమతులు చేసి గత ఏడాది ఇదే వ్యవధిలో చేసిన రూ.131 కోట్లు కంటే 201 శాతం వృద్ధి సాధించింది. ఇదే వ్యవధిలో ఇతర అమ్మకాల్లోనూ 49 శాతం వృద్ధిశాతం సాధించడం విశేషం. దీంతో రెండు నెలల్లోనే సంస్థ వార్షిక టర్నోవర్ లక్ష్యంలో 15 శాతాన్ని సాధించినట్లయింది. ఈ రెండు నెలల్లో సేలబుల్ స్టీల్ ఉత్పత్తిలో 24 శాతం వృద్ధి సాధించగా, హాట్‌మెటల్, లిక్విడ్ స్టీల్, విద్యుత్ తయారీలో వరుసగా 10 శాతం, 13 శాతం, 24 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సిఎండి పి. మధుసూధన్ సంస్థ ఉద్యోగులను అభినందించారు.