ఇన్‌పుట్ వ్యయాలు పెరుగడంతో, కార్ల ధరలను పెంచబోతున్నట్టు కార్ల తయారీ సంస్థలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జర్మన్ కారు తయారీదారు ఫోక్స్‌వాగన్ కూడా తన మోడల్స్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 జనవరి నుంచి తన మోడల్స్ అన్నింటిపై రూ.20వేల వరకు ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల్లో, స్థానిక ఇన్‌పుట్ వ్యయాల్లో మార్పులు వంటి పలు బాహ్య ఆర్థిక కారణాలతో కార్ల ధరలను పెంచబోతున్నట్టు ఫోక్స్‌వాగన్ ప్యాసెంజర్ కార్ల డైరెక్టర్ స్టెఫెన్ నాప్ తెలిపారు. ఈ ప్రభావం తమ ప్రొడక్ట్ రేంజ్ అన్నింటిపై పడనున్నట్టు పేర్కొన్నారు.
దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ కూడా బుధవారం తన కార్లపై వచ్చే నెల నుంచి రూ.20వేల వరకు ధర పెంచబోతున్నట్టు తెలిపింది. నిర్వహణ, ఇతర వ్యయాలు పెరుగుతుండడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. అదేవిధంగా టాటా మోటార్స్, మహింద్రా అండ్ మహింద్రా, టోయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా మోటార్స్, స్కోడా ఆటో ఇండియాలు కూడా ధరలను పెంచనున్నట్టు ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment