
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో ఒకేరోజు 49 పైసలు (0.70 శాతం) పడిపోయింది. 70.59 వద్ద ముగిసింది. రూపాయి మంగళవారం ముగింపు 70.10 కాగా, బుధవారం ట్రేడింగ్ ఒక దశలో రూపాయి 70.65 స్థాయికి కూడా పడిపోయింది. రూపాయి తాజా గణాంకాలు ముగింపులో, ఇంట్రాడేలో తాజా కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. బుధవారం ప్రారంభంతోనే గ్యాప్ డౌన్‌తో 70.32 వద్ద ప్రారంభమైంది. ముఖ్యాంశాలు చూస్తే...
►అమెరికా పటిష్ట వృద్ధి ధోరణి ‘డాలర్ బలోపేతం’ అంచనాలను పటిష్టం చేసింది. మున్ముందు డాలర్ మరింత పెరుగుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. చమురు దిగుమతిదారుల నుంచి ‘నెలాంతపు’ డాలర్ల డిమాండ్ తీవ్రమయ్యింది. దీనితో రూపాయి భారీగా పడింది.
► దీనికి తోడు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
► ఆగస్టు 13 తరువాత రూపాయి ఒకేరోజు తీవ్ర స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. నాడు ఒకేరోజు 110 పైసలు (1.6%) బలహీనపడింది.
►ఇంతక్రితం రూపాయి ముగింపులో కనిష్టస్థాయి 70.16. సోమవారం (ఆగస్టు 27వ తేదీ) ఈ ఫలితం నమోదయ్యింది. ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 70.40 (ఆగస్టు 17వ తేదీ). అయితే అటు తర్వాత ట్రేడింగ్ సెషన్లలో కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్నట్లు కనిపించినా, చివరకు రూపాయి మరింత కిందకే జారింది.
► క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, కరెంట్ అకౌంట్ లోటు భయాలు రూపాయిని వెంటాడుతోంది. 2018–19లో ప్రభుత్వ ఆదాయం– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం 3.3 శాతం దాటుతుందన్న మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ అంచనాలూ రూపాయి పతనానికి దారితీశాయి.
► ఆగస్టు 17తో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు 33.2 మిలియన్ డాలర్లు తగ్గి 400.8 బిలియన్ డాలర్లకు చేరడమూ రూపాయిపై ప్రతికూలత చూపుతోంది. గడచిన కొన్ని నెలలుగా భారత్ విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. రూపాయి 69 స్థాయిలో ఉన్నప్పుడు దీనిని ఈ స్థాయిలో నిలబెట్టడానికి డాలర్‌లను మార్కెట్‌లోకి ఆర్‌బీఐ పంప్ చేసినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మారకపు విలువను మార్కెట్ విలువకు వదిలేస్తున్నట్లు విశ్లేషణ.
68–70 శ్రేణిలో ఉంటుంది...
డాలర్ మారకంలో రూపాయి సమీప కాలం లో 68–70 శ్రేణిలోనే ఉంటుందని భావిస్తున్నాం. డిమాండ్–సరఫరాల మధ్య నెలకొన్న కొన్ని అసమానతలే ప్రస్తుత రూపాయి బలహీన ధోరణికి కారణం. త్వరలో డాలర్ మారకంలో రూపాయి విలువ 68–70 శ్రేణిలో స్థిరపడుతుంది.
–ఎస్‌సీ గార్గ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
రేపటి జీడీపీ గణాంకాలపై దృష్టి...
శుక్రవారంనాడు భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలు వెలువడనున్నాయి. ద్రవ్యలోటు గణాంకాలూ వస్తాయి. సమీప భవిష్యత్తులో రూపాయి విలువను నిర్ణయించేవి ఇవే. సమీప కాలంలో రూపాయి 70.20–70.75 శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నా.
–రుషబ్ మారూ, ఆనంద్ రాఠీ స్టాక్ బ్రోకర్స్
Comments
Please login to add a commentAdd a comment