
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తెలుగు ప్రజలకు తాజా హెచ్చరికలను జారీ చేసింది. ఇటీవలి కాలంలో తప్పుడు సందేశాలు, పుకార్లు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా షేర్ కావడం, అనంతరం జరుగుతున్న అమానుష దాడుల నేపథ్యంలో వాట్సాప్ ఈ ప్రకటనను విడుదల చేసింది. యూజర్లు అందుకున్న సమాచారం నిజమైనదా, నకిలీదా నిర్ధారించుకోవడానికి సంబంధించి 10 చిట్కాలను ఈ ప్రకటనలో సూచించింది.
వార్తాపత్రికల్లో ఒక ప్రకటన జారీ చేసింది. తప్పుడు సమాచారం, అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. పుకార్ల వ్యాప్తిని నిరోధించడంలో తమతో సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఉభయ తెలుగు రాష్టాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలపై దాడులు, మరణాలు చోటుచేసుకోవడంతో వాట్సాప్ ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నకిలీ వార్తలను అరికట్టడానికి వాట్సాప్ చేస్తున్న ప్రయత్నంపై తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి స్వాగతించారు. మరోవైపు కేవలం ప్రకటనలను మాత్రమే విడుదల చేస్తే పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదని అల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలను ఇప్పటికే చేపట్టి ఉండాల్సిందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తగిన చర్యలు చేపట్టాలన్నారు.