ఫుడ్ స్టార్టప్ లకు గడ్డుకాలం..! | Why business is turning out to be tough for food startups like Zomato | Sakshi
Sakshi News home page

ఫుడ్ స్టార్టప్ లకు గడ్డుకాలం..!

Published Tue, Mar 22 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

ఫుడ్ స్టార్టప్ లకు గడ్డుకాలం..!

ఫుడ్ స్టార్టప్ లకు గడ్డుకాలం..!

గతేడాది 235.66 మిలియన్ డాలర్ల సమీకరణ
సమీకరణఈ ఏడాది ఇప్పటిదాకా వచ్చింది 51.46 మిలియన్ డాలర్లే
సమీకరణసేవలు కుదించుకుని... ఉద్యోగులనూ తొలగిస్తున్న కంపెనీలు
సమీకరణఫుడ్ పాండా ఇండియా సేవల అమ్మకం... కొనేవారు కరువు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రెస్టారెంట్లను వెదికి పట్టి... రేటింగ్‌తో సహా చూపించే జొమాటో యాప్... జనవరి 11 నుంచి కోయంబత్తూరు, ఇండోర్, కోచి, లక్నో నగరాల్లో తన సేవలను నిలిపేసింది. 300 మంది ఉద్యోగుల్ని కూడా తొలగించింది.

 విదేశీ ఫుడ్ డెలివరీ దిగ్గజం ఫుడ్‌పాండా... గతేడాది డిసెంబర్‌లో 300 మంది ఉద్యోగుల్ని తీసేసింది. తన ఇండియా ఆపరేషన్స్‌ను అమ్మకానికి పెట్టినా... ఒక్కరూ కొనటానికి ముందుకు రాలేదని సమాచారం.

ఇక దేశీ ఫుడ్ డెలివరీ యాప్ టైనీ ఔల్ పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. గతేడాది సెప్టెంబర్‌లో ముంబై, పుణే కార్యాలయాల్లో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పేసింది.

 యూకేకు చెందిన జస్ట్‌ఈట్ దేశీయ మార్కెట్లోకి ఎంత వేగంగా వచ్చిందో.. చడీచప్పుడు కాకుండా వెళ్లిపోయింది.
అంతేకాదు!! దేశీ ఫుడ్ స్టార్టప్స్ గతేడాది 54 ఒప్పందాల ద్వారా 235.66 మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తే... ఈ ఏడాది ఇప్పటిదాకా కేవలం 3 ఒప్పందాలు మాత్రమే కుదిరాయి. వాటిద్వారా సమకూరింది కేవలం 51.46 మిలియన్ డాలర్లు.

 ఈ గణాంకాలు చాలవూ.. దేశంలో ఫుడ్ స్టార్టప్స్‌కు ఎంతటి ఎదురుగాలి వీస్తోందో చెప్పటానికి..
‘తినడానికి తిండి.. కట్టుకునేందుకు దుస్తులు.. ఉండేందుకు ఇల్లు’ మనిషి కనీస అవసరాలివే. ఇందులో దుస్తులు, ఇల్లు విషయం కాసేపు పక్కన పెడితే... ఒక్కరోజు తిండి లేకున్నా భూమ్మీద నూకలు చెల్లిపోయినట్టే. అందుకే ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్న స్టార్టప్స్... తిండి విషయంలోనూ అంతే కీలకంగా మారాయి. దేశంలో ఈ-కామర్స్ తర్వాతి స్థానం ఫుడ్ స్టార్టప్స్‌దే అనేంత స్థాయికి ఎదిగిపోయాయి. కాకపోతే ఏడాదికాలంగా పరిస్థితి తిరగబడింది. అవే ఫుడ్ స్టార్టప్స్ తిరోగమన బాటలో పయనిస్తున్నాయిపుడు. ‘‘ప్రస్తుతం దేశంలో ఫుడ్ స్టార్టప్ పరిస్థితిల కోడి ముందా.. గుడ్డు ముందా అన్నట్లుంది. తమ వెబ్‌సైట్‌లో రెస్టారెంట్ల జాబితా ఎక్కువగా లేకపోతే కస్టమర్లు ఆయా స్టార్టప్‌ల వెబ్‌సైట్‌ను గానీ, యాప్‌ను గానీ చూడరు. అదే సమయంలో భారీ వినియోగదారులు లేకుంటే సదరు రెస్టారెంట్లు కూడా స్టార్టప్‌లను దగ్గరకు రానివ్వటం లేదు. ఇదే స్టార్టప్స్ ఫెయిల్యూర్‌కే ప్రధాన కారణం’ అని ఓ ఫండింగ్ సంస్థ నిపుణుడు విశ్లేషించారు.

 తిండి మీద అంచనాలెక్కువ...
ఫుడ్‌ను విక్రయం అంటే ఆన్‌లైన్‌లో ఫోన్లు, దుస్తులు అమ్మినంత సులువేమీ కాదు. ఆన్‌లైన్‌లో ఏది కొన్నా డెలివరీకి 2-3 రోజుల సమయం తీసుకుంటారు. ఫుడ్ విషయానికొస్తే... ఆర్డర్ చేసిన గంటలోపే కస్టమర్‌కు చేరిపోవాలి. దీనికితోడు ఆహా రం వేడిగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండాలి. లేకపోతే తిరస్కరిస్తారు. ‘‘ఫుడ్ మీద కస్టమర్లు చాలా అంచనాలు పెట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ తప్పవు’’ అని లీడ్ ఏంజిల్స్ నెట్‌వర్క్ దక్షిణభారత వైస్ ప్రెసిడెం ట్ వినుత రాళ్లపల్లి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు.

 మొబైల్స్, యాప్స్ మార్కెట్టే కీలకం..
దేశంలో ఫుడ్ సేవల మార్కెట్ విలువ 48 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ఇందులో సంఘటిత పరిశ్రమ వాటా దాదాపు 18-20 బిలియన్ డాలర్లు. దీన్లో 15 బిలియన్ డాలర్ల వ్యాపారం కేవలం ఫోన్ల ద్వారానే జరుగుతున్నట్లు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న స్వతంత్ర సంస్థ వీసీసీ ఎడ్జ్ ఒక నివేదికలో తెలియజేసింది. దేశంలో రోజుకు ఫోన్ ద్వారా 10 లక్షల ఆర్డర్లు వస్తున్నాయని పేర్కొంది. ‘‘25 ప్రధాన నగరాల్లోని 75 వేల రెస్టారెంట్లలో (లంచ్, డిన్నర్) ఫోన్ ద్వారా 10 లక్షలకు పైనే ఆర్డర్లు వస్తున్నాయి. డామినోస్‌కు ఫోన్, నెట్, యాప్ ద్వారా రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల వరకు ఆర్డర్లు వస్తున్నాయి. యాప్స్‌నే తీసుకుంటే స్విగ్గీ 15 వేలు, జొమాటో 13వేలు.. ఇలా అన్ని స్టార్టప్స్ రోజుకు మొత్తం 50 వేల ఆర్డర్లను ప్రాసెస్ చేస్తున్నాయి’’ అని వీసీసీ తెలియజేసింది.

 20కి మించి స్టార్టప్స్ లేవు..
ప్రస్తుతం దేశంలో జొమాటో, టైనీ ఔల్, ఈట్లో, స్విగ్గీ, ఫుడ్ పాండా, హలోకర్రీ వంటి 20కి మించి ఫుడ్ స్టార్టప్స్, యాప్స్ లేవు. అవి కూడా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణే వంటి దేశంలోని ప్రధానమైన 25 నగరాలకే పరిమితమయ్యాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పెద్దగా విస్తరణ కావట్లేదు. ఇప్పటివరకు దేశంలో ఫుడ్ స్టార ్టప్స్ సమీకరించిన విలువ కేవలం అర బిలియన్ డాలర్లు. అదే చైనాలోని ఫుడ్ స్టార్టప్స్ విషయానికొస్తే ఇవి 3 బిలియన్ డాలర్లు సమీకరించాయి. ఈ  ఏడాది దేశంలో జనవరి నెలలో దేశీయ స్టార్టప్స్‌లో 3 ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ సుమారు 300 కోట్లుంటే.. ఇందులో స్విగ్గీ కంపెనీయే రూ.230 కోట్ల నిధులను సమీకరించింది. ఇటీవలే స్విగ్గీలో నార్వెస్ట్ వెంచర్స్ పార్టనర్స్, సైఫ్ పార్టనర్స్, ఇతరులు కలసి ఈ పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు జొమాటో 225 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించగా... ఇందులో టెమసెక్, సెకోయా క్యాపిటల్, ఇన్నోఎడ్జ్ పెట్టుబడుల వాటా 220 మిలియన్ డాలర్లు. 2014లో ప్రారంభమైన టైనీ ఔల్‌లో సెకోయా క్యాపిటల్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ 27 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు.

 డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లు రారు..
దేశీయ ఫుడ్ స్టార్టప్స్ నిధుల సమీకరణ మీద పెట్టినంత దృష్టి... స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లు, వారి జీవన స్థితిగతులపై పెట్టడం లేదు. డిస్కౌంట్లు, రాయితీల ద్వారా కస్టమర్లను ఆకర్షించుదామనుకునే కంపెనీలకు నిధుల సమీకరణ, విస్తరణ కష్టంగా మారింది. కొన్ని సంస్థలు ఇప్పుడు నో-డిస్కౌంట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులు, వారి భావోద్వేగాలు, స్థానిక స్థితిగతుల్ని అర్థం చేసుకొని మెనూ రూపొందించాలన్నది నిపుణుల మాట.

దేశంలో ఫుడ్ స్టార్టప్స్ వ్యాపారం తీరిదీ...
రెస్టారెంట్ లిస్టింగ్:
తమ వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా స్థానిక రెస్టారెంట్లు, మెను, ధరలు, ఆఫర్ల వివరాలను అందిస్తాయి. ఇలా రెస్టారెంట్లకు కస్టమర్లను పెంచుతాయి.
స్టార్టప్స్: జొమాటో
ఫుడ్ ఆర్డరింగ్: వెబ్‌సైట్, యాప్‌ల్లో ఫుడ్‌ను ఆర్డరిస్తే.. వాటిని స్థానిక రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి పార్శిళ్ల రూపంలో డెలివరీ చేస్తాయి. ఇలా రెస్టారెంట్ల అమ్మకాలు పెరుగుతాయి.
స్టార్టప్స్: స్విగ్గీ, ఫుడ్‌పాండా, టైనీ ఔల్...
క్లౌడ్ కిచెన్: షెఫ్‌లను నియమించుకుని ఆహారాన్ని తయారుచేసి నేరుగా కస్టమర్లకు అందిస్తాయి.
స్టార్టప్స్: హోలాషెఫ్, ఫ్రెష్ మెను, భుక్కడ్, డైట్ ఆన్ క్లిక్...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement