చిటికెలో సమస్త సమాచారాన్నిఅందిస్తున్న కృత్రిమమేధ యాప్‌లు
అక్షరాలు, అంకెల విశ్లేషణ మొదలు సొంతంగా నేర్చుకొని చెప్పగల సామర్థ్యం సొంతం
‘బూన్ గైడ్ ఉండగా.. పరీక్షల భయం దండగ’.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) సామాన్యులకు అందుబాటులోకి రాని 1980లలో కాలేజీ కుర్రాళ్లు తమను పరీక్షల గండం గట్టెక్కించే గైడ్ గురించి గొప్పగా చెప్పుకొనే మాట అన్నమాట. అయితే కాలంతోపాటు కంప్యూటర్ల పనితీరు, సామర్థ్యాలు అనూహ్యంగా పెరగడంతో ఇప్పుడు విద్యార్థులు మొదలు ఉద్యోగుల దాకా ఏ రంగానికి చెందిన వారికి కావాల్సిన సమాచారమైనా చిటికెలో అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(Artificial intelligence)(ఏఐ) సాంకేతికత యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ అప్లికేషన్లు, వాటి ఉపయోగాలపై కథనం. – సాక్షి, హైదరాబాద్
కృత్రిమ మేధ (ఏఐ) రంగం కేవలం ఐదంటే ఐదేళ్లలో ప్రపంచ గమనాన్ని మార్చేసింది. అదెలాగో తెలియాలంటే జనరేటివ్ ఏఐ ఎదుగుదలను చూడాలి. ఓపెన్ ఏఐ అనే సంస్థ 2019లో తొలిసారి ‘జీపీటీ–2’ను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రశ్నలడిగినా తడుముకోకుండా అక్షరాల్లో బదులివ్వడం దీని ప్రత్యేకత. అయితే ఓపెన్‌సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండటంతో ఏఐ వేగంగా అభివృద్ధి చెందింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్ల శకం మొదలైంది.
అందరికీ చిరపరిచితం సిరి, అలెక్సా..
మనలో చాలామందికి చిరపరిచితమైన చాట్‌జీపీటీ వర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్. సిరి, అలెక్సా, ‘ఓకే గూగుల్’ లాంటివన్నీ ఈ కోవకు చెందిన జనరేటివ్ ఏఐ అప్లికేషన్లే. మీరేదైన ప్రశ్న అడిగితే.. ఇంటర్నెట్ మొత్తాన్ని వెతికి సమాధానాలు చెబుతాయి. స్క్రీన్లపై అయితే పదాల రూపంలో.. మొబైల్‌ఫోన్లు ఇతర గాడ్జెట్ల ద్వారానైతే మాటల్లో బదులిస్తాయి. ఇవి కాకుండా ఫొటోలు, వీడియోలను గుర్తుపట్టేందుకు, వాటిని వర్గీకరించేందుకు గూగుల్ ఫొటోస్, డీప్‌ఆర్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
మీకు ఇంగ్లిష్ అంత బాగా రాకపోయినా...తప్పుల తడకలా ఉండే వాక్యాలను కూడా సరి చేయాలంటే ‘గ్రామర్‌లీ’, ‘క్విల్‌బోట్’ వంటి ఏఐ అప్లికేషన్లు వాడుకోవచ్చు. అంకెల్లోని సమాచారాన్ని (ఎక్సెల్ షీట్లు) చదివేసి విశ్లేషించేందుకు ‘జూలియస్.ఏఐ’ ఉపయోగపడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులకు నిత్యం ప్రాణ సంకటంగా మారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు ‘కాన్వా’తోపాటు బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
అంచనాలకూ ఏఐ యాప్స్..
ఇప్పటివరకు మనం చూసిన అప్లికేషన్లన్నీ నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా పనిచేస్తాయి. కానీ ప్రిడిక్టివ్ అనలటిక్స్ రకం ఏఐ అప్లికేషన్లు ఉన్న సమాచారం ఆధారంగా అంచనాలు కట్టేందుకు వాడతారు. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐబీఎం’ వాట్సన్ పేరుతో సిద్ధం చేసిన జనరేటివ్ ఏఐ అప్లికేషనే అందుకు ఉదాహరణ. ఆరోగ్య రంగంలో కొత్త సంచలనం ఇది. ఇమేజ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇది ఎక్స్–రేలను చదివేస్తుంది. వైద్య నివేదికలు, వైద్య పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని (సైంటిఫిక్ జర్నళ్ల ద్వారా) ఔపోసన పట్టేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వైద్యుల కంటే ముందే కేన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులను కూడా కచి్చతంగా గుర్తించేలా దీన్ని సిద్ధం చేశారు. ‘అడా’, ‘బాబిలోన్ హెల్త్’ వంటివి కూడా మన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి సలహా సూచనలు ఇవ్వగలిగే ఏఐ అప్లికేషన్లు.
సొంతంగా సృష్టిస్తాయి కూడా...
మనిషిని, యంత్రాన్ని వేరు చేసేదేమిటని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం యంత్రం సొంతంగా ఏదీ సృష్టించలేదని చెబుతారు. అది నిజం కూడా. కానీ జనరేటివ్ ఏఐ అప్లికేషన్లతో ఈ పరిస్థితి కూడా మారిపోయింది. ‘డాల్–ఈ’, ‘మిడీజరీ్న’ వంటి అప్లికేషన్లు సొంతంగా బొమ్మలు గీయగలవు. సంగీతాన్ని సృష్టించగలవు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని తమదైన రాగాలు తయారు చేయగలవు కూడా..! అంతెందుకు.. ఒక సినిమా స్టోరీ రాయాలనుకోండి.. కథ తాలూకూ ప్రధాన ఇతివృత్తాన్ని చెబితే చాలు.. ఏఐ అప్లికేషనే స్క్రీన్ ప్లేతో కలిపి కథ మొత్తాన్ని రాసిచ్చేస్తుంది!
డబ్బు లెక్కలకూ యాప్‌లు..
స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫలానా కంపెనీ షేర్ కొన్నేళ్లుగా ఎలాంటి లాభాలు తెచి్చపెడుతోందో? లేదా ఇబ్బందులు ఎదుర్కొంటోందో తెలియాలి. అయితే ‘మింట్’, ‘రాబిన్‌హుడ్’ వంటి అప్లికేషన్లు ఈ పనులన్నీ చిటికెలో చక్కబెట్టేస్తాయి. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్‌ఎల్‌ఎం) ఆధారంగా కంపెనీల ఆర్థిక పరిస్థితులన్నింటినీ మదించి పెట్టుబడుల సలహాలిస్తాయి.
డీప్‌సీక్ రాకతో విప్లవం..
తాజాగా ‘డీప్‌సీక్’ సృష్టించిన ప్రభంజనం అంతాఇంత కాదు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) ఏఐ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయన్న ఊహలను పటాపంచలుచేస్తూ చైనా సంస్థ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆధారిత ఎల్‌ఎల్‌ఎం మోడల్ ‘ఆర్1’ను చూసి ఎని్వడియా వంటి దిగ్గజ సంస్థలే నోరెళ్లబెట్టాయి. ఇప్పుడున్న ఏఐ మోడల్స్‌కన్నా ఎంతో మెరుగైన తార్కిక విశ్లేషణ సామర్థ్యం డీప్‌సీక్ ఆర్1కు ఉండటమే దాన్ని మరో మెట్టుపై నిలబెడుతోంది. దీని రాకతో ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment