20 దేశాల కరెన్సీకి ఒకే ఒక్కకార్డు
♦ మల్టీ కరెన్సీ కార్డును
♦ విడుదల చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
♦ హజ్ యాత్రికుల కోసం
♦ హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్ కూడా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ దేశానికి వెళుతున్నా, ఆ దేశపు కరెన్సీని వెంట తీసుకెళ్లటం మనకు తెలిసిందే. కానీ, ఇప్పుడా అవసరాలేమీ లేదంటోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. 20 దేశాలకు చెందిన కరెన్సీ కోసం ఒకే ఒక్క కార్డు వెంట ఉంటే సరిపోతుందని చెబుతోంది. వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా మల్టీకరెన్సీ కార్డును విడుదల చేసింది. ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే మాట్లాడుతూ.. ఈ కార్డుతో విదేశాల్లో ప్రయాణించే వారికి స్థానిక కరెన్సీని వెంట తీసుకెళ్లాల్సిన అవసరముండదని, స్థానిక కరెన్సీ కోసం ఫారెక్స్ ఎక్స్‌చేంజ్‌లకు, బ్యాంకుల వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ఒకే కార్డుతో ఏ దేశంలో అయినా డిజిటల్ లావాదేవీలు, నగదు ఉపసంహరణ సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పారు. దీంతో పాటూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ కస్టమర్ల కోసం రెమిట్ నౌ, ట్రేడ్ ఆన్ నెట్ సేవలను కొత్తగా జత చేశామన్నారు. ‘రెమిట్ నౌ ద్వారా విదేశాల్లో చదువు కోసం విద్యార్థులకు నగదు లేదా రుణాలు, లేదా వైద్య ఖర్చులను నేరుగా జమ చేయవచ్చు’ ట్రేడ్ ఆన్ నెట్‌తో వర్తకులు ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన నగదు లావాదేవీలను జరుపుకోవచ్చని తెలిపారు.
హజ్ యాత్రికులకు హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకంగా హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్ కార్డును కూడా విడుదల చేసింది. దీంతో యాత్రికులు నగదు రూపంలో సౌదీ రియాల్స్‌ను తీసుకెళ్లాల్సిన అవసరముండదు. ఈ కార్డుతో నగదును ఉపసంహరణ కూడా చేసుకునే వీలుంటుంది. తెలంగాణలో 201, ఆంధ్రప్రదేశ్‌లో 142 హెచ్‌డీఎఫ్‌సీ శాఖల్లో ఈ కార్డులను కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారానూ కొనుగోలు చేయవచ్చు. కార్డుతో పాటూ ఐదేళ్ల ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంటుంది. ఈ కార్డు కాలపరిమితి ఐదేళ్లు. కార్డు కొనుగోలుకు రూ.250, కార్డులో నగదు జమ చేసేందుకు రూ.75 చార్జీలుంటాయి. కార్డు ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలన్నీ ఉచితమే. కానీ, నగదు ఉపసంహరణ చేస్తే మాత్రం ఒక దానికి 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.