పెట్రోల్‌తో డీజిల్‌ ధర సమానం! ఎందుకు? | Why Diesel price high than Petrol | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌తో డీజిల్‌ ధర సమానం! ఎందుకు?

Published Tue, Jun 30 2020 9:38 AM | Last Updated on Tue, Jun 30 2020 10:02 AM

Why Diesel price high than Petrol - Sakshi

ఈ నెల(జూన్‌) మొదటి నుంచీ దాదాపు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా అధిక ఎక్సయిజ్‌ డ్యూటీలు, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)ల మార్జిన్లు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు విదేశీ మార్కెట్లో ఇటీవల ముడిచమురు ధరలు బలపడుతుండటం కూడా కారణమవుతున్నట్లు తెలియజేశారు. దేశీ అవసరాల కోసం దాదాపు 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. దీంతో డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ధరలను ప్రభావితం చేస్తుంటాయని ఫారెక్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఎక్సయిజ్‌ పెంపు
సాధారణంగా విదేశాలలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ధరలే అధికంగా ఉంటాయి. ఇందుకు ఉత్పత్తి వ్యయాలే కారణం. అయితే దేశీయంగా డీజిల్‌ కంటే  పెట్రోల్‌ ధరలే ప్రీమియంలో కదులుతుంటాయి. ఇందుకు ఎక్సయిజ్‌ డ్యూటీ, వ్యాట్‌(వీఏటీ) ప్రభావం చూపుతుంటాయి. కానీ ప్రస్తుతం దేశంలోనూ పెట్రోల్‌తో పోలిస్తే డీజిల్‌ ధరలు సమానంగా మారాయి. ఇందుకు అధిక ఎక్సయిజ్‌ డ్యూటీలు, పెరిగిన పెట్రో కంపెనీల మార్కెటింగ్‌ మార్జిన్లు కారణమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కొద్ది రోజులుగా ఎక్సయిజ్‌ డ్యూటీలతోపాటు, వ్యాట్‌ పెరుగుతూ పోవడంతో పెట్రోల్‌ ధరలకు డీజిల్‌ సమానమైనట్లు వివరించాయి. ఫలితంగా ఇటీవల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒకే స్థాయికి చేరినట్లు తెలియజేశాయి.

ధరలు తగ్గినా
కోవిడ్‌-19 నేపథ్యంలో గత రెండు నెలల్లో ముడిచమురు ధరలు డీలాపడినప్పటికీ తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 42 డాలర్ల స్థాయిలో కదులుతోంది. ఇదే సమయంలో డాలరుతో మారకంలో రూపాయి విలువ 75 ఎగువనే నిలుస్తోంది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం డ్యూటీలను పెంచుతూ వచ్చింది. అయితే రిటైల్‌ ధరలపై ప్రభావం పడకుండా వీటిని హెచ్చిస్తూ వచ్చింది. ఫలితంగా ఫిబ్రవరిలో లీటర్‌ పెట్రోల్‌కు రూ. 20గా ఉన్న ఎక్సయిజ్‌ డ్యూటీ ప్రస్తుతం రూ. 33కు ఎగసింది. ఈ బాటలో డీజిల్‌పై ఎక్సయిజ్‌ డ్యూటీ లీటర్‌కు రూ. 16 నుంచి రూ. 32కు పెరిగింది. 2014లో పెట్రోల్‌పై పన్నులు లీటర్‌కు . 9.5గా నమోదుకాగా.. డీజిల్‌పై ఇవి రూ. 3.5గా అమలైనట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావించారు. పెట్రోల్‌పై వ్యాట్‌ రూ. 15.3 నుంచి పెరిగి 17.7కు  చేరగా.. డీజిల్‌పై మరింత అధికంగా రూ.9.5 నుంచి రూ. 17.6కు ఎగసింది. విదేశాలలో చమురు ధరలు పతనమై తిరిగి కోలుకున్నప్పటికీ గత మూడు నెలల్లో అంటే మే చివరి వరకూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు యథాతథంగా కొనసాగాయి. ఇదే సమయంలో పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు లీటర్‌ ధరపై రూ. 2-3 నుంచి రూ. 13-19 వరకూ ఎగశాయని.. తిరిగి ప్రస్తుతం 5 స్థాయికి చేరాయని పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. కాగా.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో 70 శాతంవరకూ ఎక్సయిజ్‌, వ్యాట్‌ ఆక్రమిస్తుంటాయని విశ్లేషకులు పేర్కొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement