హైదరాబాద్లో యాపిల్ సొంత కేంద్రం!
♦ డెవలప్‌మెంట్ సెంటర్ ఆరంభం రేపు...
♦ దీనికోసమే ఇక్కడికి వస్తున్న కంపెనీ సీఈఓ టిమ్‌కుక్
♦ ఈ సందర్భంగా అతిపెద్ద వార్త వింటారంటూ కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే నంబర్-1 కార్పొరేట్ కంపెనీ... టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హైదరాబాద్‌కు రానున్నారు. భారత్‌లో తొలిసారిగా అడుగు పెడుతున్న ఆయన... గురువారం హైదరాబాద్‌కు వస్తారు. ఈ సందర్భంగా ఆయన యాపిల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించే అవకాశముంది. సిటీలో టిమ్‌కుక్ మూడు గంటలపాటు ఉంటారని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు చెప్పారు.
ప్రస్తుత టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను గచ్చిబౌలిలోని టిస్మన్ స్పియర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనంలో 2.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అమెరికా వెలుపల సంస్థకు ఇదే తొలి ఫెసిలిటీ కూడా. దీనికోసం యాపిల్ రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. యాపిల్ మ్యాప్స్ టెక్నాలజీకి కావాల్సిన సేవలను ఈ కేంద్రం అందిస్తుంది. 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది. తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు పర్యవేక్షణలో కంపెనీకి అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేయటం గమనార్హం. కుక్ వారంరోజుల భారత పర్యటన నిమిత్తం తన ప్రైవేటు జెట్‌లో మంగళవారం అర్థరాత్రి ముంబైకి చేరుకున్నారు. 19న హైదరాబాద్ వచ్చి... అట్నుంచి ఢిల్లీ వెళతారు. 20, 21 తేదీల్లో అక్కడే ఉంటారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. మేకిన్ ఇండియా అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం.
ఇతర రంగాల్లోనూ యాపిల్ పెట్టుబడులు!
టిమ్‌కుక్ రాక నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ... ‘అతి పెద్ద వార్తను మీతో ఎల్లుండి పంచుకోబోతున్నాను. అప్పటి వరకు సస్పెన్స్’ అంటూ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా ప్రస్తుతం లీజు కార్యాలయంలో డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఆరంభించినా... సొంత కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని యాపిల్ చూస్తోందని, ఈ క్రమంలో ప్రభుత్వం యాపిల్‌కు స్థలాన్ని కేటాయించే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా కేటీఆర్ ఈ ప్రకటన చేయొచ్చని తెలిసింది. అంతేకాక ఈ మధ్య యాపిల్ తన పంథా మార్చుకుని ఇతర రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేస్తోంది. ఇటీవలే చైనాలో రైడ్ షేరింగ్ సంస్థ ‘దీదీ’లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. చైనాలో యాపిల్ ఐట్యూన్స్‌ను నిషేధించిన నేపథ్యంలో ఆ ప్రభుత్వంతో సాన్నిహిత్యం కోసమే ఈ పెట్టుబడి పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే భారత్‌లోనూ కొన్ని పెట్టుబడులను ప్రకటించే అవకాశం లేకపోలేదని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ మరిన్ని ఊహాగానాలకు అవకాశం కల్పించింది.
అవకాశాల విపణి..!
ఐఫోన్, ఐప్యాడ్లను విక్రయిస్తున్న యాపిల్... ఇప్పటిదాకా తాను విక్రయిస్తున్న మార్కెట్లలో గరిష్ఠ అమ్మకాల దశకు చేరుకుంది. అక్కడ వృద్ధి ఆశించినంతగా లేదు. దీంతో అభివృద్ధి చెందుతున్న చైనా, భారత్‌లపై ఫోకస్ చేసింది. గతేడాదితో పోలిస్తే 2016 జనవరి-మార్చి త్రైమాసికంలో యాపిల్ అమ్మకాలు దేశంలో 62 శాతం వృద్ధి చెందాయి. యాపిల్ ఉత్పత్తులను కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రూపొందిస్తోంది. ఫాక్స్‌కాన్‌కు భారత్‌లో ప్లాంట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలోనూ ప్లాంటు ఉంది. కాగా యాపిల్ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని మహారాష్ట్రలో నెలకొల్పే అవకాశముందని, 1,200 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫెసిలిటీ రానుందని ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి.