విప్రో మైసూరు యూనిట్ మూత
బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీం ప్రేమ్ జీ ఆధర్వంలోని విప్రో కార్యాలయాన్ని మూసి వేసింది. ఎల్‌ఈడీ ఉత్పత్తులకు పెరుగుతున్న భారీ డిమాండ్ కారణంగా తమ మైసూరు ఆఫీసును మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. హూటాగల్లీ ఇండస్ట్రీ ఏరియాలో సుమారు 7.5 ఎకరాల్లో విస్తరించిన ఉన్న యూనిట్‌కు సోమవారం లాకౌట్ నోటీసులు అతికించింది. దీంతో కంపెనీ కార్మికుల భవితవ్యం ఆందోళనలో పడింది.
మైసూరులోని లైటింగ్ తయారీ యూనిట్‌ను మూసివేశామని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పేర్కొంది. ఎల్‌ఈడీ ఉత్పత్తుల ప్రాధాన్యత పెరగడంతో తమ సీఎఫ్‌ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత రెండేళ్ళలో డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని కంపెనీ తెలిపింది. పరిస్థితి మెరుగుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించినప్పటికీ ఏడాదికి పైగా ఉత్పత్తి క్షీణించడంతో ఆర్థిక భారం భరించలేనిదిగా మారిందని తెలిపింది.
అలాగే ఈ ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు రెండునెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారాఅన్ని రెగ్యులేటరీ అవసరాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 84 మంది శాశ్వత కార్మికులు, 66గురు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రతిపాదించినట్టు వెల్లడించింది.
మరోవైపు కంపెనీ లాకౌట్ పై కార్మికులు సోమవార రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. నిరవధిక ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కంపెనీ తమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.