న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో... ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.2,192 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.2,070 కోట్లతో పోలిస్తే 6 శాతం వృద్ధి సాధించింది. మొత్తం వ్యయాలు తగ్గడం, వడ్డీ భారం కూడా తగ్గడం, ఇతర ఆదాయం అధికంగా రావడంతో ఈ వృద్ధి సాధించామని విప్రో పేర్కొంది. మూడో క్వార్టర్‌కు అంతంత మాత్రం గైడెన్స్‌ను ఇచ్చింది.
మొత్తం ఆదాయం రూ.14,407 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.14,135 కోట్లకు తగ్గినట్లు విప్రో సీఈఓ అబిదాలి నీముచ్‌వాలా చెప్పారు. ఐటీ ఉత్పత్తుల సెగ్మెంట్లో రూ.300 కోట్ల ఆదాయం సాధించామన్నారు. మొత్తం ఆదాయంలో అధిక ప్రాధాన్యత ఉన్న ఐటీ సేవల సెగ్మెంట్ ఆదాయం 2 శాతం పెరిగి 201 కోట్ల డాలర్లకు చేరిందని చెప్పారాయన.
ఇది తమ ఆదాయ అంచనా (గైడెన్స్).. 196 కోట్ల డాలర్ల నుంచి 200 కోట్ల డాలర్ల కంటే అధికమని, తొలిసారిగా ఒక క్వార్టర్లో ఐటీ సేవల సెగ్మెంట్ నుంచి 200 కోట్ల డాలర్లను మించి ఆదాయం సాధించామని పేర్కొన్నారు. రానున్న అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో ఐటీ సేవల వ్యాపారం నుంచి 201 కోట్ల నుంచి 205 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఆదాయం ఆర్జించగలమన్న అంచనాలున్నాయని వివరించారు.
షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం పొందామని, దీన్ని పూర్తిచేసే ప్రయత్నాలు చేస్తున్నామని అబిదాలి చెప్పారు. గత క్యూ2లో 1,66,790గా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఈ క్యూ2లో 1,63,759కు తగ్గింద ని తెలిపారు. ఆట్రిషన్ రేటు 15.7 శాతంగా ఉందని చెప్పారు. మార్కెట్ ముగిసిన తర్వాత విప్రో ఫలితాలు వచ్చాయి. బీఎస్‌ఈలో విప్రో షేర్ స్వల్పంగా తగ్గి రూ.289కి చేరింది. అమ్మకాల పరంగా విప్రో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయని ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది. గైడెన్స్ నిరాశపరిచిందని రిలయన్స్ సెక్యూరిటీస్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment