భారత్‌లోకి ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్ | With G3 Launch, LG Eyes 3-Fold Growth in India Smartphone Sales | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్

Published Tue, Jul 22 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

భారత్‌లోకి ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్

భారత్‌లోకి ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్

16 జీబీ వేరియంట్ ః రూ.47,990
 32 జీబీ వేరియంట్ ః రూ.50,990
జీ స్మార్ట్‌వాచ్ ః రూ.15,000

 
ముంబై: ఎల్‌జీ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్- జీ3ని భారత మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. దీంతో పాటు జీ స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుదల చేసింది. జీ3 స్మార్ట్‌ఫోన్ 16 జీబీ వెర్షన్ ధర రూ.47,990, 32 జీబీ వెర్షన్ ధర రూ. 50,990 అని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ సూన్ క్వాన్ పేర్కొన్నారు. జీ స్మార్ట్‌వాచ్ ధర రూ.15,000 ఉంటుందన్నారు.  
 
5.5 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే జీ3 స్మార్ట్‌ఫోన్‌లో  5.5 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, ఫోన్ వెనకభాగంలో 13 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ ప్లస్ కెమెరా, 2.1 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,  2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని సూన్‌క్వాన్ పేర్కొన్నారు.  స్లిమ్ మెటాలిక్ డిజైన్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో లేజర్ ఆటో ఫోకస్ కెమెరా, స్మార్ట్ కీ బోర్డ్, స్మార్ట్ నోటీస్ తదితర ఫీచర్లున్నాయని వివరించారు. ఫోన్ పోయినప్పుడు, అది పనిచేయకుండా చేసే కిల్ స్విచ్ వంటి ప్రత్యేక ఫీచర్ కూడా ఉందని వివరించారు.
 
బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్
ఇక ఈ ఎల్‌జీ జీ3 స్మార్ట్‌ఫోన్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ సంతకంతో కూడిన 15,000 లిమిటెడ్ ఎడిషన్ జీ3 ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఈ ఫోన్‌లను కొన్న కొద్దిమంది వినియోగదారులకు అమితాబ్ బచ్చన్‌ను కలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది చివరి కల్లా 5 లక్షల జీ3 ఫోన్‌లు విక్రయమవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
 
వాచ్ ధరకు సమానంగా డిస్కౌంట్లు
ఆండ్రాయిడ్ వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే  జీ స్మార్ట్‌వాచ్‌లో 1.65 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ, బ్లూటూత్ కనెక్టివిటీ,  400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయని సూన్ క్వాన్ వివరించారు. దుమ్ము, నీళ్లలో పడినా ఈ వాచ్ పాడైపోదని పేర్కొన్నారు. రూ.15,000 ధర ఉన్న ఈ వాచ్‌కు అంతే విలువ గల ఆఫర్లనందిస్తున్నామని చెప్పారు. జీ3 ఫోన్‌తో కలిపి ఈ వాచ్‌ను కొనుగోలు చేస్తే రూ.5,000 డిస్కౌంట్ అందిస్తామని, రూ.3,500 క్విక్ సర్కిల్ కేస్ ఉచితమని, రూ.6,500 విలువైన వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు.
 
10 శాతం మార్కెట్ వాటా
అంతర్జాతీయంగా జీ3 ఫోన్ మంచి అమ్మకాలు సాధిస్తోందని, భారత్‌లో కూడా ఇదే విధంగా విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని సూన్ క్వాన్ వ్యక్తం చేశారు. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని క్వాన్ పేర్కొన్నారు. రూ.20,000-30,000 రేంజ్‌లో మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement