సంస్కరణలపై అనిశ్చితితో నష్టాలు
చివర్లో అమ్మకాల వెల్లువ
- సెన్సెక్స్ శ్రేణి.. ప్లస్ 182 - మైనస్ 218
- చివరకు 135 పాయింట్ల నష్టంతో 28,102 వద్ద ముగింపు...
- 39 పాయింట్లు క్షీణించి 8,526కు నిఫ్టీ
ట్రేడింగ్ చివరి అరగంటలో అమ్మకాల వెల్లువ కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. భూ సేకరణ, జీఎస్‌టీ బిల్లులు ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశాల్లేవన్న ఆందోళనతో లాభాల స్వీకరణ జరిగి అమ్మకాలు పోటెత్తాయి. దీంతో అప్పటివరకూ లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల పాలయ్యాయి. బీఎస్‌ఈ సెనెక్స్ 135 పాయింట్లు క్షీణించి 28,102 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 8,526 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు వారాల్లో సెన్సెక్స్‌కు ఇదే ఒక రోజు అత్యధిక పతనం. డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జరపడం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం కూడా ప్రభావం చూపాయి. ఆయిల్, ఎఫ్‌ఎంసీజీ, కొన్ని టెక్నాలజీ, వాహన షేర్లు నష్టపోయాయి.
తీవ్ర ఒడిదుడుకులు..: సెన్సెక్స్ 28,251 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దిగుమతుల బిల్లు తగ్గగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల బాగా తగ్గి ఆకర్షణీయంగా ఉన్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల జోరు పెరిగింది. దీంతో సూచీలు లాభాల్లోనే సాగాయి. సెన్సెక్స్ ఒక దశలో 28,419 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 182 పాయింట్లు లాభపడింది) గరిష్ట స్థాయిని తాకింది. అమ్మకాల వెల్లువ కారణంగా 28,018 పాయింట్ల (శుక్రవారం నాటి ముగింపుతో పోల్చితే 218 పాయింట్లు నష్టం)కు పడిపోయింది.
20 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు
30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,529 షేర్లు నష్టాల్లో, 1,424 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,105 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,379 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,78,752 కోట్లుగా నమోదైంది.