వండర్‌లా లాభం రూ.25.96 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల నిర్వహణలో ఉన్న వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ 2017–18 తొలి త్రైమాసికంలో రూ.25.96 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి పన్ను తర్వాత లాభం రూ.22.43 కోట్లగా ఉంది. అంటే ఏడాదిలో 16 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 2017 క్యూ1లో మొత్తం ఆదాయం 17 శాతం వృద్ధి రేటుతో రూ.105.43 కోట్లు. గతేడాది ఇదే సమయానికి రూ.90.43 కోట్లు. గతేడాది క్యూ1లో బెంగళూరు, కోచి, హైదరాబాద్‌లోని పార్క్‌ల ఆదాయం రూ.86.89 కోట్లు కాగా..
ఈ ఏడాది క్యూ1లో 18 శాతం వృద్ధితో 102.21 కోట్లని నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. ఇదిలా ఉంటే గతేడాది క్యూ1తో పోలిస్తే కోచిలోని పార్క్‌కు కస్టమర్ల రాక 6 శాతం వృద్ధిని నమోదు చేస్తే.. బెంగళూరులో 4 శాతం, హైదరాబాద్‌లో 5 శాతం కస్టమర్ల రాక తగ్గిందని సంస్థ ఎండీ అరున్ కే చిట్టిలపిళై ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కస్టమర్ల రాక తగ్గడానికి ప్రధాన కారణం ఏప్రిల్ 2016లో పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆఫర్లను విడుదల చేయటమేనని ఆయన తెలిపారు. చెన్నై తిరుప్పొరూర్‌లో 57 ఎకరాల్లో రానున్న పార్క్ స్థల సమీకరణ పూర్తయిందని, మరో 3 నెలల్లో నిర్మాణ పనులను ప్రారంభిస్తామని 2019–20 ఆర్ధిక సంవత్సరానికి పార్క్ వినియోగంలోకి తీసుకొస్తామని ఆయన వివరించారు.