స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు
చైనీస్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా?
Published Wed, Aug 16 2017 4:32 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
చైనీస్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ వ్యక్తిగత సమాచారాన్ని మీ ఫోనే తీసుకెళ్లి, చైనా చేతుల్లో పెట్టే అవకాశాలున్నాయట. డేటా లీకేజీ, దొంగతనంపై తాజాగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో 21 స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీచేసింది. మొబైల్ ఫోన్ల భద్రత కోసం, కంపెనీలు తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలేమిటో తమకు తెలియజేయాలని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన కంపెనీల్లో ఎక్కువగా చైనీస్ సంస్థలే ఉన్నాయి.
కంపెనీలు అందిస్తున్న భద్రతా భరోసాలో డివైజ్, దాని ఆపరేటింగ్ సిస్టమ్, డివైజ్ బ్రౌజర్, ప్రీ-లోడెడ్ యాప్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లేదా స్మార్ట్‌ఫోన్ భద్రతా, రక్షణ ఎంతో అవసరమని, విలువైన సమాచారాన్ని యూజర్లు దీనిలో కలిగి ఉంటారని ఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. డిజిటల్ పేమెంట్స్ నుంచి వ్యక్తిగత డేటా వరకు ప్రతిదానికి మొబైల్‌ను వాడుతున్నారన్నారు.
ఒకవేళ అవసరమైన తనిఖీలో, ఆడిట్‌లో డివైజ్‌లు కనుక పట్టుబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. థర్డ్ పార్టీకి డేటా లీకయ్యే విషయంలో తాము అసలు తలొగ్గేది లేదని తెలిపారు. ప్రస్తుతం డేటా పాత్ర చాలా కీలకమని, దాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఉందని అధికారి పేర్కొన్నారు. ఐటీ యాక్ట్, సెక్షన్ 43(ఏ) కింద యూజర్ల డేటాను సురక్షితంగా ఉంచే బాధ్యత కంపెనీలదేనని కూడా తెలిపారు. నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా కాంటాక్ట్ జాబితాలు, టెక్ట్స్ మెసేజ్‌లు లీకవుతున్నట్టు కేసులు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అదేవిధంగా ఈ సమస్య రిమోట్ సర్వర్లలో ఉందన్నారు. భారత్‌లో చాలా చైనీస్ కంపెనీలు స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నాయని, కానీ వారందరికీ భారత్‌లో సర్వర్లు లేనట్టు తెలిపారు. మరోవైపు డొక్లామ్ వివాద పరిస్థితుల నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఈ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Advertisement