పుర్‌కాయస్థాను ఢిల్లీ పోలీస్ ఆఫీస్‌కు తీసుకొస్తున్న దృశ్యం
న్యూఢిల్లీ: చైనా అనుకూల సమాచారాన్ని భారత్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు భారీ స్థాయిలో నగదును స్వీకరించిందన్న ఆరోపణలపై ఆన్‌లైన్ న్యూస్‌పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ పోలీసులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. సంస్థకు సంబంధించిన ఆఫీసులతోపాటు అందులో పనిచేసే జర్నలిస్టులు, సిబ్బందికి సంబంధించిన ఇళ్లలోనూ పోలీసులు విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టారు.
న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకులు, ఎడిటర్–ఇన్–చీఫ్ ప్రబీర్ పుర్‌కాయస్థా, హెచ్‌ఆర్ చీఫ్ అమిత్ చక్రవర్తిని మొదట ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత ఇద్దరినీ అరెస్ట్‌చేశారు. 100 ప్రాంతాల్లో ఏకంగా 500 మంది ఢిల్లీ పోలీసులు ఒకేసమయంలో దాడిచేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ముంబైలలో ఈ సోదాలు జరిగాయి. సోదాలు చేయాల్సిన వ్యక్తులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చెందిన ఢిల్లీలోని నివాసంలోనూ సోదాలు జరిగాయి.
ఆయనకు సహాయకునిగా ఉండే శ్రీనారాయణ్ కుమారుడు సుమిత్ ఇదే న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తుండటంతో ఏచూరీ ఇంట్లోనూ పోలీసు తనిఖీలు కొనసాగాయి. దీంతో ఏచూరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలోని సంస్థ ముఖ్య కార్యాలయంలోని వారిని ప్రశ్నించాక ఆ ఆఫీస్‌కు పోలీసులు సీలువేశారు. విదేశీ ప్రయాణాలు, పౌరసత్వ(సవరణ) చట్టంపై షాహీన్‌బాగ్ వద్ద చెలరేగిన ఆందోళనలు, రైతుల ఉద్యమాలు తదితరాలపై జర్నలిస్టులను 25 అంశాలపై ప్రశ్నించామని పోలీసులు వెల్లడించారు.
న్యూస్‌క్లిక్‌కు నిధులు ఎలా వస్తున్నాయనే కోణంలో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యూస్‌క్లిక్ కార్యాలయాల్లో సోదాలు చేయడం తెల్సిందే. ఈ విషయంలో ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు అందించిన సమాచారంతోనే మంగళవారం ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, నేరమయ కుట్ర సెక్షన్ల కింద కొత్తగా కేసు నమోదుచేసి దాడులు చేశారు.
ఈ సందర్భంగా పలువురి నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, హార్డ్ డిస్‌్కలు, ఫ్లాష్ డ్రైవ్‌లను స్వాదీనం చేసుకున్నారు. ఆగస్ట్ 17న అత్యంత కఠిన ఉగ్రవ్యతిరేక చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక )చట్టంకింద నమోదైన కేసు ఆధారంగానే కొత్తను నమోదుచేసి దర్యాప్తు వేగవంతం చేశారు. చైనాతో సంబంధం ఉన్న కొన్ని సంస్థల నుంచి గత మూడేళ్లకాలంలో రూ.38.05 కోట్ల నగదు న్యూస్‌క్లిక్ పోర్టల్‌కు ముట్టిందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ నగదులో కొంత మొత్తం పాత్రికేయులు గౌతమ్ నవ్‌లఖా, తీస్తా సీతల్వాడ్‌లకు చేరినట్లు ఆరోపిస్తోంది.
విపక్షాల తీవ్ర విమర్శలు
మీడియా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ సహా పలు విపక్ష పార్టీలు ప్రభుత్వ తీరును తూర్పారబట్టాయి. ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాసహా పలు మీడియా సంఘాలు పోలీసు దాడులను ఖండించాయి. మోదీ సర్కార్‌ను విమర్శించే పాత్రికేయులపై ప్రభుత్వం కత్తిగట్టిందని ఆక్షేపించాయి.
Comments
Please login to add a commentAdd a comment