
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ వీడియో కమ్యూనిటీ వేదిక యూట్యూబ్... భారత్‌లో తొలిసారిగా పాప్–అప్ స్పేస్‌ను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో ఈ నెల 7 వరకు జరిగే ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికయింది. యూట్యూబ్ క్రియేటర్లకు పాప్–అప్ స్పేస్‌లో ప్రవేశం ఉచితం. వీడియోల చిత్రీకరణలో శిక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి కంటెంట్ రూపుదిద్దుకుంటోందో వివరిస్తారు. వీడియోల చిత్రీకరణ కూడా చేపట్టవచ్చు.
ఇందుకోసం ప్రత్యేక సెట్స్ సైతం వేస్తారు. 700 మందికి పైగా యూట్యూబ్ క్రియేటర్లు ఇందులో పాల్గొంటున్నారు. మహాతల్లి, తెలుగువన్, వైవా, చాయ్ బిస్కట్, కంత్రీ గైస్, కిరాక్ హైదరాబాదీస్, ఖేల్‌పీడియో వంటి క్రియేటర్లు స్థానిక భాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను పునర్‌నిర్వచించారని యూట్యూబ్ స్పేసెస్ గ్లోబల్ హెడ్ లాన్స్ పోడెల్ గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. దేశంలో ఏడాది కాలంలో 50 మంది ఇండిపెండెంట్ క్రియేటర్లు ఒక్కొక్కరు 10 లక్షల చందాదార్లను సొంతం చేసుకున్నారని కొనియాడారు. వేల మంది క్రియేటర్లు లక్ష చందాదార్ల మార్కును దాటారని తెలియజేశారు.
రెండో స్థానంలో తెలుగు..
ప్రపంచవ్యాప్తంగా శాశ్వత ప్రాతిపదికన 9 యూట్యూబ్ స్పేసెస్ ఉండగా, భారత్‌లో ముంబైలో ఏర్పాటు చేశారు. 7,500 మందికిపైగా క్రియేటర్లు ముంబై కేంద్రాన్ని ఆసరాగా చేసుకున్నారు. వీరు తీసిన వీడియోలకు 10 కోట్లకుపైగా వ్యూస్ ఉన్నాయి. దేశంలో చిత్రిస్తున్న యూట్యూబ్ వీడియోల్లో హిందీ తర్వాతి స్థానాన్ని తెలుగు కైవసం చేసుకుంది. కామెడీ, మ్యూజిక్ విభాగాలు టాప్‌లో ఉన్నట్లు యూట్యూబ్ స్పేసెస్ ఆసియా పసిఫిక్ హెడ్ డేవిడ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో అధిక భాగం క్రియేటర్లకే పంచుతున్నట్టు చెప్పారు. ‘ప్రతి నెల 18 కోట్ల మంది యూట్యూబ్‌కు లాగిన్ అవుతున్నారు. 85 శాతం మంది స్మార్ట్‌ఫోన్ ద్వారా వీక్షిస్తున్నారు. భారత్‌లో 40 కోట్ల మంది ఆన్‌లైన్‌కు కనెక్ట్ అయ్యారు. 2020 నాటికి ఈ సంఖ్య 60 కోట్లను తాకుతుంది’ అని చెప్పారాయన. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ప్రతినెలా యూట్యూబ్‌లో లాగిన్ అవుతున్నారని, రోజూ 100 కోట్ల మంది వీడియోలను చూస్తున్నారని తెలియిజేశారు.
Comments
Please login to add a commentAdd a comment