సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్‌మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందేకాకుండా కాలిబాటలో గోవిందమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు.
సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంను కల్పించనున్నారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను అనుమతిస్తారు. ఉదయం 7.30 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు 30 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు 200 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు రానున్నట్టు సమాచారం.
ప్రముఖుల బస, దర్శన ఏర్పాట్లు
మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న వారు తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయానికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరాజు నిలయం, సీతా నిలయానికి వెళ్లాలి. ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు.
అఖిల భారత సర్వీసు అధికారులు సన్నిధానానికి, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్ విశ్రాంతి గృహానికి వెళ్లాలి. నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు.
సామాన్య భక్తులకు బస, దర్శన ఏర్పాట్లు
ఏకాదశి సందర్భంగా వచ్చే సామాన్య భక్తుల కోసం కేంద్రియ విచారణ కార్యాలయంలోని అన్ని కౌంటర్లలో గదులు కేటాయించనున్నారు. ఇక్కడ ఎలాంటి సిఫారసులు స్వీకరించరు.
స్వామి దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఇందులో భాగంగానే కాలిబాట దర్శనం కూడా నిలిపివేశారు. ఒకే క్యూలైనులోనే భక్తులను అనుమతించనున్నారు.
సామాన్య భక్తులకు ఎండ, వాన, చలి, మంచుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 42 వేల మందికి సరిపడేలా నారాయణగిరి ఉద్యాన వనాల్లో 20 తాత్కాలిక షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
ఈ సారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కిలోమీటర్ల నిడివిలో కొత్తక్యూలైను నిర్మించారు. తొలుత కంపార్ట్‌మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత ఆళ్వార్‌ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి మీదుగా ఎ టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్‌రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు నిర్మించిన క్యూలైన్‌లోకి అనుమతిస్తారు.
భక్తులు 24 నుంచి 30 గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తులకు మరుగుదొడ్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సుమారు 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలు, మజ్జిగ, కాఫీ, టీ తదితరాలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment