సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌సీ) ప్రయోగశాలలో బుధవారం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 32 ఏళ్ల యువ శాస్త్రవేత్త మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరోస్పేస్ విభాగానికి చెందిన హైపర్‌సోనిక్ షాక్ వేవ్ ప్రయోగశాలలో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఒక హైడ్రోజన్ సిలిండర్ పేలిపోయింది. ఐఐఎస్‌సీతో ఒప్పందం చేసుకున్న సూపర్‌వేవ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఆ సమయంలో ప్రయోగాలు చేస్తున్నారు.
పేలుడు ధాటికి మైసూరుకు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సిలిండర్‌కు సమీపంలో ఉన్న మనోజ్ కుమార్ శరీరం పూర్తిగా కాలిపోయింది. గాయపడిన మిగిలిన ముగ్గురు శాస్త్రవేత్తలు కార్తీక్, అతుల్య, నరేశ్ కుమార్‌లను హుటాహుటిన స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాకున్నా భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు విడుదల కావడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరులోని సదాశివనగర పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ఐఐఎస్‌సీ చాన్నాళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment