indian institute of science (iisc)
-
మధుమేహ బాధితులకు 3డీ ప్రింటెడ్ చెప్పులు
బెంగళూరు: మధుమేహ(డయాబెటిస్) బాధితుల కోసం బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) డిపార్టుమెంట్ ఆఫ్‌మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు వినూత్నమైన పాదరక్షలు తయారు చేశారు. ఇందుకు కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ రిసెర్చ్(కేఐఈఆర్) తగిన సహకారం అందించింది. డయాబెటిస్ బాధితుల్లో కాళ్లకు పుండ్లు పడితే త్వరగా మానవు. దాంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఒక్కోసారి కాలు తొలగించే పరిస్థితి కూడా రావొచ్చు. ఇలాంటి వారి కోసం ఐఐఎస్సీ పరిశోధకులు రూపొందించిన 3డీ ప్రింటెడ్ చెప్పులు చక్కగా పనిచేస్తాయి. కాలు ఎలాంటి ఆకృతిలో ఉన్న దానికి అనుగుణంగా మారిపోవడం వీటి ప్రత్యేకత. నడకను బట్టి చెప్పులు వాటంతట అవే సరిచేసుకుంటాయని పరిశోధకులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ చెప్పులు ధరిస్తే కాళ్లకు గాయాలయ్యే అవకాశాలు చాలా స్వల్పమేనని అన్నారు. ఒకవేళ అప్పటికే గాయాలైనా అవి త్వరగా మానిపోవడానికి ఈ చెప్పులు ఉపయోగపడతాయని వివరించారు. -
ఐఐఎస్సీలో పేలుడు: శాస్త్రవేత్త మృతి
సాక్షి, బెంగళూరు: బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ప్రయోగశాలలో బుధవారం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 32 ఏళ్ల యువ శాస్త్రవేత్త మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏరోస్పేస్ విభాగానికి చెందిన హైపర్సోనిక్ షాక్ వేవ్ ప్రయోగశాలలో మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఒక హైడ్రోజన్ సిలిండర్ పేలిపోయింది. ఐఐఎస్సీతో ఒప్పందం చేసుకున్న సూపర్‌వేవ్ టెక్నాలజీస్ అనే స్టార్టప్‌కు చెందిన నలుగురు శాస్త్రవేత్తలు ఆ సమయంలో ప్రయోగాలు చేస్తున్నారు. పేలుడు ధాటికి మైసూరుకు చెందిన ఏరోస్పేస్ శాస్త్రవేత్త మనోజ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సిలిండర్‌కు సమీపంలో ఉన్న మనోజ్ కుమార్ శరీరం పూర్తిగా కాలిపోయింది. గాయపడిన మిగిలిన ముగ్గురు శాస్త్రవేత్తలు కార్తీక్, అతుల్య, నరేశ్ కుమార్‌లను హుటాహుటిన స్థానిక ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం తెలియరాకున్నా భారీ స్థాయిలో హైడ్రోజన్ వాయువు విడుదల కావడం వల్లే పేలుడు జరిగి ఉండొచ్చని ఫోరెన్సిక్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై బెంగళూరులోని సదాశివనగర పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ఐఐఎస్సీ చాన్నాళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. -
ప్రపంచశ్రేణి విద్యాసంస్థలు
మన విద్యకూ, విద్యాసంస్థలకూ ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ కృత నిశ్చయం మెచ్చదగిందే. అందుకోసం విద్యా సంస్థలను ఎంపిక చేసి వాటికి సకల వనరులూ కల్పించి తీర్చిదిద్దాలన్న సంకల్పమూ మంచిదే. కానీ తాము ప్రపంచశ్రేణి విద్యా సంస్థలుగా రూపొం దుతామని ఇచ్చిన వాగ్దానాన్ని ఓ కమిటీ పరిశీలించి, వాటికి ఆ సామర్థ్యం ఉన్నదని అంచనా వేసుకుని, ఆ వెనువెంటనే వాటికి ఘనతర విద్యాసంస్థలన్న భుజకీర్తులు కట్టబెట్టడం భావ్యమేనా అన్న సందేహం సహజంగానే తలెత్తుతుంది. సోమవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) మంత్రిత్వ శాఖ వెలువరించిన జాబితాలో చోటు దక్కిన సంస్థలు సరే... దక్కని సంస్థలేమిటో గమనిస్తే ఎంపికకు కమిటీ అనుసరించిన ప్రాతిపదికలేమిటన్న గందరగోళం ఏర్ప డుతుంది. మొన్న ఏప్రిల్‌లో ఇదే హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పది అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి ప్రథమ స్థానం వస్తే, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయిదో స్థానంలో ఉంది. ఇంకా జాదవ్‌పూర్ యూనివర్సిటీ, సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వగైరాలున్నాయి. ఈ సంస్థలన్నీ అత్యుత్తమ సంస్థల జాబితాలో ఎప్పుడూ అగ్ర భాగానే ఉంటాయి. కానీ ఇందులో ఇప్పుడు ఒక్క ఐఐఎస్సీకి తప్ప మరే విద్యా సంస్థకూ చోటు దొరకలేదు. ఏప్రిల్‌నాటి జాబితాలో ఎక్కడో ఉన్న ఢిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీలు మాత్రం తాజా జాబితాలో చేరాయి. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ ఈ ఘనతర విద్యాసంస్థల ఎంపిక బాధ్యతను త్వరలో రద్దు కాబోతున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కి అప్పజెప్పింది. యూజీసీ ఇందుకోసం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ని నియమించింది. మొదట్లో పబ్లిక్ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది విద్యా సంస్థల్ని ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా చెరో మూడింటితో సరిపెట్టారు. ఎంపికైన పబ్లిక్ రంగ విద్యాసంస్థకు ఒక్కోదానికి ఏడాదికి రూ. 1,000 కోట్లు సమకూర్చాలని నిర్ణయించినందువల్ల కావొచ్చు...జాబితా చిక్కిపోయింది. పది సంస్థల్ని గనుక ఎంపిక చేస్తే వీటికోసం ఏడాదికి రూ. 10,000 కోట్లు ప్రత్యేకించి కేటాయించాల్సివస్తుంది. అది పెనుభారం కావొచ్చునన్న ఉద్దేశంతో ఇప్పుడు మూడింటికే పరిమితమైనట్టు కనబడుతోంది. ఇక ప్రైవేటు రంగ సంస్థలు సొంతంగా నిధులూ, ఇతర వనరులూ సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఈ సంస్థలన్నీ నియంత్రణ వ్యవస్థ నుంచి విముక్తమవుతాయి. ఎలాంటి ప్రమాణాలు నిర్దేశించాలో, ప్రవేశాలకు ఏ ప్రాతిపదికలు నిర్ణయిం చాలో, ఎవరిని అధ్యాపకులుగా తీసుకోవాలో, ఏ కోర్సులు ప్రవేశపెట్టాలో, ఏ ప్రపంచ విశ్వ విద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలో, ఏ ఏ రంగాల్లో పరిశోధనలకు స్థానమీయాలో ఇవి సొంతంగా నిర్ణయించుకుంటాయి. ఎంపికైన ప్రభుత్వ రంగ సంస్థలు ప్రస్తుత చట్టాలకూ, నియం త్రణలకూ లోబడే పనిచేస్తాయని చెప్పినా... వాటికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తామని నిరుడు విడుదల చేసిన పత్రం తెలిపింది. ఆ వెసులుబాట్లలోనే ఒక ప్రమాదం పొంచి ఉంది. విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీటికిచ్చారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థికైనా ప్రవేశం నిరాకరించకుండా స్కాలర్షిప్లు, రుణ సదుపాయం అందు బాటులో ఉంచాలని సూచించినా ఆచరణలో అది ఎందరికి దక్కుతుందో చూడాలి. ఈ జాబితాలోని ప్రైవేటు సంస్థల గురించి చెప్పుకోవాలి. వీటిలో మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, బిట్స్ పిలానీ, రిలయన్స్‌కు చెందిన జియో ఇనిస్టిట్యూట్ ఉన్నాయి. ఇందులో మణిపాల్ అకాడమీ, బిట్స్ పిలానీలకున్న పేరు ప్రఖ్యాతుల గురించి వేరే చెప్పుకోనవసరం లేదు. కానీ ఇంకా కళ్లు తెరవని జియో ఇనిస్టిట్యూట్‌కు ఘనతర శ్రేణి విద్యా సంస్థల జాబితాలో చోటెలా దక్కిందో అనూహ్యం. దీనికి గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీలో ఇచ్చామని, అది కూడా ‘అంగీకారపత్రమే’ తప్ప పూర్తి స్థాయి హోదా కాదని హెచ్ఆర్డీ చెబుతోంది. వచ్చే మూడేళ్లలో నిరూపించుకుంటే ఆ హోదా దక్కుతుందని వివరిస్తోంది. అలాంటపుడు ముందే దాన్ని ఇతర అగ్రశ్రేణి సంస్థల జాబితాలో చేర్చడం ఎందుకు? అగ్రశ్రేణిలో ఉంటామని చెబుతున్న సంస్థ ప్రస్తుత పనితీరు, మరింత ఉన్నతంగా ఎదగడానికి అది అనుసరించదల్చుకున్న విధానాలు బేరీజు వేసుకుని, అందుకు దానికున్న అవకాశాలేమిటో, సామర్థ్యమెంతో పరిగణనలోకి తీసుకుని నిర్ణయిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. జియో ఇనిస్టిట్యూట్‌కు రిలయన్స్ వంటి అగ్రగామి సంస్థ దన్ను ఉంది. ఆర్థిక వనరులూ పుష్కలంగా ఉన్నాయి. వాటినెవరూ కాదనరు. కేవలం సంస్థ వెనకుండే నిధులు, దాని స్థిరాస్తులు చూసి ఇప్పటికిప్పుడు జాబితాలో చోటు ఇవ్వడానికి బదులు మూడేళ్ల తర్వాత నిరూపించుకున్నాకే ఆ స్థాయి కల్పించవచ్చుకదా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. నిజానికి అశోకా యూనివర్సిటీ, జిందాల్ యూనివర్సిటీ వంటి ప్రైవేటు రంగ సంస్థలు ఇప్పటికే ఖ్యాతి గడించాయి. వాటినెందుకు విస్మ రించారో ఎవరికీ తెలియదు. 1995లో చైనా ‘ప్రాజెక్టు–211’ పేరిట వంద విశ్వవిద్యాలయాలు నెల కొల్పాలని నిశ్చయించుకుని వాటికి పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. దాదాపు పాతికేళ్లు గడిచేసరికి అవన్నీ విద్యలో, పరిశోధనల్లో ప్రపంచంలోనే మేటిగా తయారయ్యాయి. మన ఉన్నత స్థాయి విద్యాలయాలు నిధుల కొరతతో, సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నాయి. కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నాయి. విద్యార్థులకు ఇక్కడ నాసిరకం విద్యే దిక్కవుతున్నది. వీటన్నిటికీ జవసత్వాలు చేకూర్చే విస్తృత ప్రణాళికలు రూపొందించడానికి బదులు కేవలం కొన్నిటికే నిధుల వరద పారించి, ఇతర సంస్థల కడుపు మాడ్చడం వల్ల దేశానికి ఒరిగేదేమిటో పాలకులే చెప్పాలి. -
గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఐఐటీలు ఢమాల్
న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు(ఐఐటీలు) గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఢమాల్ మనిపించాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ మంగళవారం విడుదలచేసిన 2016-17 ర్యాంకింగ్స్‌లో ఐఐటీలు తమ స్థానాలను కోల్పోయాయి. ఈ ర్యాంకింగ్‌లో వరుసగా ఐదో ఏడాది కూడా అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) ప్రపంచంలో బెస్ట్‌గా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియాలో అత్యున్నత సంస్థగా మళ్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు బెంగళూరే చోటు దక్కించుకుంది. కానీ టాప్ 150 స్థానం నుంచి మాత్రం ఈ ఇన్స్టిట్యూట్ పడిపోయిందని క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. అయితే ఐఐటీ మద్రాసు మాత్రం టాప్ 250 స్థానాన్ని చేధించి, ఐదు స్థానాలు పైకి ఎగబాకినట్టు ర్యాంకింగ్ల్లో తెలిసింది. 10 ఇండియన్ యూనివర్సిటీలో తొమ్మిది 700 ర్యాంకింగ్‌లో నిలిచాయి. అయితే గతేడాది కంటే ఈ యూనివర్సిటీలు తమ ఈ ర్యాంక్‌లను కోల్పోయాయి. అకాడమిక్, ఎంప్లాయర్ రిప్యూటేషన్ రెండింటి ర్యాంకింగ్‌లోనూ ఈ ఇన్స్టిట్యూట్లు పేలవమైన ప్రదర్శన కనబర్చినట్టు ర్యాంకింగ్ రిపోర్టు వెల్లడించింది. వరల్డ్ టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్ నుంచి కేవలం నాలుగు ఇన్స్టిట్యూట్లు మాత్రమే చోటు దక్కించుకున్నట్టు రీసెర్చ్ రిపోర్టు తెలిపింది. భారత్ బెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సీ 11వ స్థానాన్ని ఆక్రమించుకుంది. ర్యాంకింగ్‌లో పడిపోవడానికి చాలా కారణాలు ప్రభావితం చేశాయని క్యూఎస్ ఇంటిలిజెంట్ యూనిట్ రీసెర్చ్ హెడ్ బెన్ సౌటర్ తెలిపారు. పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లు తక్కువగా ఉండట, ఇతర దేశాలనుంచి పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్లను ఇండియా నియమించుకోవడం ర్యాంకింగ్‌లను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రాంతీయ పోటీదారులను ఇండియా పెంచుకుని ఫర్ఫార్మెన్స్ను ఇండియా మెరుగుపరుచుకోవాలని ఈ ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్టు సౌటర్ తెలిపారు. 2004 నుంచి యూఎస్ ఇన్స్టిట్యూషన్సే ఈ ర్యాకింగ్‌లో టాప్ 3 స్థానాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాయి. -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చేయాలంటే?
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ మెరైన్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లను తెలపండి? -రఘునందన్, పాలకొల్లు. మెరైన్ ఇంజనీర్లు ప్రధానంగా ఓడలు, పెద్ద పెద్ద పడవల రూపకల్పనలో పాల్పంచుకుంటారు. వాటి ఇంజిన్, వివిధ భాగాల పనితీరును గమనించడం కూడా వీరి బాధ్యతే. ఓడ సమర్థంగా నడవడానికి కావల్సిన అన్ని రకాల వ్యవహారాలను మెరైన్ ఇంజనీర్లు పర్యవే క్షిస్తారు. మోడ్రన్ మెరైన్ టెక్నాలజీ, బేసిక్ టూల్స్, వర్క్‌షాప్ టెక్నాలజీ, పవర్ హౌసెస్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తదితర అంశాలను మెరైన్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత పోర్ట్స్, షిప్పింగ్ పరిశ్రమలు, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వంటి సంస్థల్లో ఉపాధి పొందొచ్చు. అమెరికా, యూకేలలో కూడా వీరికి విరివిగా అవకాశాలుంటాయి. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం. ప్రవేశం: ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా వెబ్సైట్: www.andhrauniversity.edu.in మెరైన్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్-కోల్‌కతా. వెబ్సైట్: www.merical.ac.in టోలనీ మారిటైమ్ ఇన్స్టిట్యూట్-పుణే వెబ్సైట్: www.tolani.edu వీఈఎల్ఎస్ యూనివర్సిటీ-చెన్నై వెబ్సైట్: www.velsuniv.org పీజీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -అశోక్, ప్రొద్దుటూరు ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు.. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్ కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.iiit.ac.in జేఎన్టీయూ-హైదరాబాద్ కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) వివరాలకు: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్) వివరాలకు: www.andhrauniversity.edu.in ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి. ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా? -ధరణి, సికింద్రాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వివరాలకు: www.iisc.ernet.in యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్ష వివరాలను తెలపండి? జియాలజీలో కోర్సులను ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -షాలినీ, కుప్పం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జియాలజిస్ట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది. దీని ద్వారా జియాలజిస్ట్, హైడ్రో జియాలజిస్ట్ పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత: జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజనీరింగ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ/ ఎర్త్ సైన్స్ అండ్ రీసోర్సెస్ మేనేజ్మెంట్/ ఓషియనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియాస్ స్టడీ/ పెట్రోలియం జియో సెన్సైస్/ పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/ జియో కెమిస్ట్రీ/ జియలాజికల్ టెక్నాలజీ/ జియో ఫిజికల్ టెక్నాలజీ) హైడ్రో జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ (జియాలజీ/అప్లైడ్ జియాలజీ/ మెరైన్ జియాలజీ) లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ైహైడ్రో జియాలజీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మొత్తం 900 మార్కులకు ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. అవి.. జనరల్ ఇంగ్లిష్ (100 మార్కులు), జియాలజీ పేపర్-1 (200 మార్కులు), జియాలజీ పేపర్-2 (200 మార్కులు), జియాలజీ పేపర్-3(200 మార్కులు), హైడ్రోజియాలజీ (200 మార్కులు). ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంటుంది. వివరాలకు: www.upsc.gov.in మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు యూజీ, పీజీ స్థాయిల్లో జియాలజీ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో), పీహెచ్డీ (జియాలజీ) కోర్సును ఆఫర్ చేస్తుంది.