మావోయిస్టుల మృతదేహాలు
సాక్షి, కొత్తగూడెం : సరిహద్దు దండకారణ్యం ఎడతెగని తుపాకుల మోతతో దద్దరిల్లుతూనే ఉంది. దీంతో ఏజెన్సీ ఏరియాలోని ఐదు రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో నిరంతరం టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. గత 5 నెలలుగా దండకారణ్యంలో మావోయిస్టులు – భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ పోరాటం నడుస్తోంది. దీంతో యుద్ధ వాతావరణం రాజ్యమేలుతోంది. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవలి కాలంలో భారీ నష్టం వాటిల్లింది.
ఈ క్రమంలో గత నెల 28 నుంచి ఈ నెల 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. దీంతో ఏజెన్సీ మొత్తం ఎప్పుడేం జరుగుతుందో అని భయంభయంగా గడపాల్సి వ చ్చింది. తడపలగుట్టల్లో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి ఇప్పటివరకు వరుసగా మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. అయితే వారోత్సవాల సమయంలో పెద్ద ఘటనలేవీ జరగకపోవడంతో ఏజెన్సీ ఊపిరి పీల్చుకుంది.
కానీ ఆ తర్వాత రెండు రోజులకే సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో ఈ ప్రాంత గిరిజనులు మరోసారి ఉలిక్కిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుక్మా జిల్లా కుంట పోలీసుస్టేషన్ పరిధిలో తాజా ఎన్‌కౌంటర్‌లో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా సుక్మా జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేయ డం గమనార్హం.
షెల్టర్‌జోన్‌లో భద్రతా దళాల దూకుడు..
మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యంలో భద్రతా బలగాలైన సీఆర్‌పీఎఫ్, ఎస్‌టీఎఫ్, డీఆర్‌జీ, గ్రేహౌండ్స్ బలగాలతో పాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని షెల్టర్‌జోన్‌గా చేసుకున్న మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సీఆర్‌పీఎఫ్ ఎప్పటికప్పుడు బేస్ క్యాంపులను మరింత ముందుకు తీసుకెళుతూ దండకారణ్యంలోకి చొచ్చుకుపోతోంది.
దీంతో దండకారణ్యం తుపాకుల మోతతో నిత్యం దద్దరిల్లుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో అనునిత్యం టెన్షన్ వాతావరణం ఉంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, బస్తర్, కాంకేర్, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో ప్రత్యేక వాతావరణం నెలకొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు మావోయిస్టులను తమ రాష్ట్రాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మావోలపై పోరుకు బలగాలను మరింతగా మోహరిస్తోంది. భారీగా సీఆర్‌పీఎఫ్ బెటాలియన్లను దింపి పోరుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
దండకారణ్యంలో మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మావోయిస్టులపై పోరుకు వ్యూహరచన చేస్తోంది. దీంతో దండకారణ్యంలో తుపాకుల మోత నిత్యకృత్యమైపోయింది. మావోయిస్టులు సైతం అదును చూసి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో దండకారణ్యంలో యద్ధవాతావరణం కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment