
శంషాబాద్ : విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారనే భయంతో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ ప్రయాణికుడు దాన్ని టాయిలెట్ రూంలో పడేశాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. 6 ఈ 1406 విమానంలో షార్జా నుంచి నగరానికి వస్తున్న షేక్ అబ్దుల్ సాజిద్ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో కస్టమ్స్ అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. విషయాన్ని గ్రహించిన షేక్ అబ్దుల్ సాజిద్ తన వద్దనున్న బంగారం బిస్కెట్లను టాయిలెట్ రూంలో పడేశాడు. సాజిద్‌ను తనిఖీ చేసిన అధికారులకు అతడి వద్ద బంగారం బయటపడలేదు. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించడంతో అసలు విషయం వెల్లడించాడు. అధికారులు టాయిలెట్ రూం నుంచి 26 బంగారు బిస్కెట్లను (2.99కేజీలు) స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1,11,60,160 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.