మృతిచెందిన పద్మారెడ్డి, దినేష్, లక్ష్మి
సాక్షి, కరీంనగర్ : పర్యవేక్షణాధికారుల తప్పిదం ఓ హెల్పర్‌కు ప్రాణసంకటంగా మారింది. డబుల్‌బెడ్రూం కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా చేయడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడ్డ సంఘటన గురువారం సిరిసిల్ల పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సెస్ పరిధిలోని సిరిసిల్ల టౌన్–2కు కిష్టయ్య హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం స్థానిక శాంతినగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం కాలనీలొ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేయాలని ఉన్నతాధికారులు, పర్యవేక్షణాధికారులు ఆదేశించారు.
ముందస్తు రక్షణ చర్యలు లేకుండానే అధికారులు కిష్టయ్యను పనులకు పంపించినట్లు సిబ్బంది తెలిపారు. కిష్టయ్య ట్రాన్స్‌ఫార్మర్‌పై పని చేస్తుండగా హఠాత్తుగా కరెంటు సరఫరా కావడంతో షాక్‌కు గురై కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ఏరియాస్పత్రికి తరలించగా..చికిత్స చేస్తున్నారు. ఏలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా హెల్పర్‌ను పనులకు పంపించడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెస్ ప్రాతినిధ్య సభ్యుడు, తదితరులు డిమాండ్ చేశారు. కిష్టయ్యకు ప్రాణహాని జరిగితే బాధ్యులెవరని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
ధర్మపురి: స్నానం కోసమని బాత్‌రూంలోకి వెళ్లగా మీటరువైరుకు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన కోస్నూర్‌పల్లెలో విషాదం నింపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జైనా గ్రామానికి చెందిన బోర్లకుంట లక్ష్మి(55) గురువారం స్నానం చేయడానికి బాత్‌రూమ్‌కు వెళ్లింది. స్నానం చేసే ప్రయత్నంలో బాత్‌రూమ్‌లో ఉన్న మీటరు వైరు చేతికి తగిలి ఎర్త్ రాగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు ధర్మపురికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త రాజలింగం ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వహీద్ తెలిపారు. బాధితురాలిది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ఎల్లారెడ్డిపేటలో వృద్ధుడు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేటకు చెందిన ఓలాద్రి పద్మారెడ్డి (68) బుధవారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నింపింది. గురువారం సంఘటన స్థలాన్ని ఎస్సై ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..రాత్రి ఇంట్లో లైట్ వెలగడం లేదని ఓల్డర్‌ను పట్టుకొని బల్బును పరిశీలిస్తుండగా షాక్‌కు గురయ్యాడు. షాక్‌తో కిందపడ్డ పద్మారెడ్డిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంట్లో చిన్న బల్బును సరిచేస్తున్న క్రమంలో నిండుప్రాణం పోవడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి భార్య హేమలత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందింది. సంఘటన స్థలాన్ని తోట ఆగయ్య, చీటి లక్ష్మణ్‌రావు, హసన్ సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
మానాలలో వలస కూలీ..
చందుర్తి (వేములవాడ): విద్యుదాఘాతంతో వలస కూలీ మృతి చెందిన సంఘటన రుద్రంగి మండలం మానాల గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని మరవల్ కడ్‌విట్ గ్రామానికి చెందిన దినేష్‌సంతుసకుమ్(22) విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కెపాసిటర్ల ఇన్‌స్టాలేషన్స్ పని చేసేందుకు మానాలకు వచ్చాడు. ఇన్‌స్టాలేషన్ గ్రూపునకు వంట చేసే పనిలో నిమగ్నమైన దినేష్‌సంతుసకుమ్‌కు పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు. గమనించిన సదరు సిబ్బంది వెంటనే విద్యుత్ వైరు తొలగించారు. ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ వైద్యం కోసం బాధితుడిని కోరుట్ల పట్టణానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రాజెక్టు అధికారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment