
కారులో గుర్తించిన గంజాయి ప్యాకెట్లు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌గేట్ వద్ద మంగళగిరి రూరల్ పోలీసులు మంగళవారం భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నైకి కారులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం అందడంతో మంగళగిరి రూరల్ సీఐ శేషగిరిరావు, తన సిబ్బందితో అప్రమత్తమయ్యారు.
మంగళవారం తెల్లవారుజామున 2.45 గంటలకు స్టేషన్ నుంచి కాజ టోల్‌గేట్ వద్దకు వెళ్లే సమయంలో జాతీయ రహదారిపై పోలీసు వాహనం ఎదురు ఏపీ 16 ఏపీ 9599 నంబరు కారు వేగంగా వెళ్లడాన్ని గమనించారు. దీంతో పోలీసులు సినీఫక్కీలో ఆ వాహనాన్ని వెంబడించారు. వాహనం కాజ టోల్‌గేట్ 3వ కానా వద్ద ఆగి ఉండడంతో పోలీసు వాహనంలోని సిబ్బంది దిగి వాహనం వద్దకు వెళ్లేలోపే, స్కార్పియో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పోలీసు వాహనాన్ని గమనించి పారిపోగా పోలీసులు వారిని వెంబడించారు.
ఆ సమయంలో బాగా చీకటిగా ఉండటంతో వారు తప్పించుకొని వెళ్లిపోయారు. పోలీసులు టోల్‌ప్లాజా కానా వద్ద ఆగి ఉన్న వాహనం వద్దకు చేరుకొని ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఆ వాహనాన్ని పక్కన పెట్టించారు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా, కారులో వెనుకవైపు భాగంలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. బ్రౌన్ కలర్ కవర్లలో గంజాయి ప్యాక్ చేసి ఉన్న 160 ప్యాకెట్లు కారులో లభ్యమైనట్లు పోలీసులు తెలియచేశారు. ఒక్కో ప్యాకెట్టు 2 కేజీల బరువుంటుందని, 300 కేజీలకు పైగానే ఈ గంజాయి ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు.
కారులో ఏపీ 07 సీఎఫ్ 0445, ఏపీ 16 బీసీ 9388, టీఎన్ 67 ఎల్ 3435 నంబర్లతో ఉన్న మరో మరో మూడు నంబర్ ప్లేట్లను గుర్తించారు. ఎక్కడా పోలీసులకు అనుమానం రాకుండా నంబర్ ప్లేట్లు మార్చుకుంటూ వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు వెనుక వైపు అద్దంపై లాయర్లకు సంబంధించిన స్టిక్కరు అంటించి ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment