కనిపించని కనుపాపలు! | 4 Children Missing In Boat Capsized In East Godavari | Sakshi
Sakshi News home page

కనిపించని కనుపాపలు!

Published Tue, Sep 24 2019 10:47 AM | Last Updated on Tue, Sep 24 2019 10:47 AM

4 Children Missing In Boat Capsized In East Godavari - Sakshi

తల్లిదండ్రులతో చిన్నారులు.. అనన్య, వైష్ణవి

చిట్టితల్లి వైష్ణవికి రోజూ గోరుముద్దలు తినిపించేది ఆ తల్లి.. అమ్మానాన్నా అంటూ ముద్దుముద్దుగా పిలుస్తుంటే మురిసిపోయేది.. చెల్లెలితో కలిసి ఇల్లంతా కలియదిరుగుతూ సందడి చేస్తుంటే ఇంటిల్లిపాదీ సంబరపడిపోయేవాళ్లు.ఇప్పుడా ఇళ్లలో ఆ సందడి లేదు.. దాని స్థానంలో విషాదం అలుముకుంది.అదీ ఓ విషాద ఘటనలో గల్లంతయ్యారు. అన్వేషణ సాగుతున్నా.. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ దొరక్కపోవడంతో తమ కంటిపాపలు కడచూపుకైనా దక్కవేమోనన్న బాధ ఆ తల్లిదండ్రుల గుండెలను పిండేస్తోంది. గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన విశాఖ జిల్లాకు చెందిన 17 మందిలో 13 మంది నిర్జీవంగానే దక్కారు.  మిగిలిన నలుగురూ చిన్నారులే.. పెద్దవారు విగతజీవులుగానైనా దక్కారు. వారి పిల్లలైనా దక్కుతారని.. వారిలో చనిపోయినవారిని చూసుకుందామనుకుంటూ.. వారి ఆచూకీయే ఇంతవరకు లభించక.. అసలు వారు సజీవంగా ఉన్నారో.. లేదో.. అర్థంకాక నగరంలోని ఆరిలోవ, రామలక్ష్మి కాలనీ, గాజువాక ప్రాంతాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారు.
–సాక్షిప్రతినిధి, విశాఖపట్నం

సాక్షి, విశాఖ సిటీ: పోయినవారు ఎలాగూ పోయా రు.. చిన్నారులైనా దక్కుతరని ఆశపెడితే.. గో దారమ్మ ఆ ఆశలను చిదిమేస్తోందన్న ఆవేదనతో నగరానికి చెందిన మూడు కుటుంబాలు కుమిలిపోతున్నాయి. ఆరిలోవ దుర్గాబజార్‌ ఏ ఎస్‌ఆర్‌ కాలనీకి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు తమ పిల్లలు వైష్ణవి, ధాత్రి అనన్య ఆచూకీ లభించక తల్లడిల్లిపోతున్నారు. వీరితో పాటు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన నగరంలోని రామలక్ష్మికాలనీలో ఉంటున్న మధుపాడ అఖిలేష్, గాజువాక కు చెందిన విఖ్యాతరెడ్డి కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లలో వత్తులేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. 15న గోదావరి నదిలో రాయల్‌ విశిష్ట బోటు ప్రమాదంలో నగరానికి చెందిన 17 మంది గల్లంతు కాగా వారిలో 13 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా జాడ తెలియని ఆ నలుగురూ తొమ్మిదేళ్లలోపు చిన్నారులే. 

కంటతడి ఆరలేదు..
ఆరిలోవకు చెందిన తలారి అప్పలరాజు, భా గ్యలక్ష్మి దంపతుల కుమార్తెలైన  వైష్ణవి(3), ధాత్రి అనన్య(ఏదాదిన్నర)లు నాన్నమ్మ అప్పలనర్శమ్మతో కలిసి ఈ నెల 15న గోదావరి నదిలో విహార యాత్రకు వెళ్లిన సంగతి తెలి సిందే. ఆ రోజు జరిగిన ప్రమాదంలో అప్పలనర్శమ్మ మృతి చెందగా.. వైష్ణవి, అనన్యల ఆచూకీ లభించలేదు. ఓ వైపు ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న అప్పలనర్శమ్మను కన్నుమూయడం, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెల జాడ లేకుండా పోవడంతో దంపతులిద్దరూ తల్లడిల్లిపోతున్నారు. పిల్లలను తలచుకంటూ ‘పెద్దది ఈ సమయంలో ఇలా చేసేది.. చిన్నది అలా అల్లరి పెట్టేది’ అని తలచుకుంటూ కుమిలిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత తొమ్మిది రోజులుగా ఆ దంపతుల కంటతడి ఆరలేదు. పిల్లలు వస్తారు అంటూ వారు వెళ్లిన దారివైపు ఆశగా ఎదురుచూడటం గమనిస్తున్న స్థానికుల గుండెలు చెమ్మగిల్లుతున్నాయి.

వారసులొస్తారా..
మరోవైపు అదే బోటులో విహారయాత్రకు వెళ్లి మృత్యువాత పడిన రామలక్ష్మి కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబానిది ఇంతకుమించిన విషాదం. ఆ రోజు విహారయాత్రకు రమణబాబు కుటుంబంతో పాటు వెళ్లిన అనకాపల్లిలోని బంధువులు, వేపగుంటలోని సోదరి, ఆమె కుమార్తె సహా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆ దుర్ఘటనలో రమణబాబు, ఆయన భార్య అరుణకుమారి సహా కుమార్తె కుశాలి కూడా కన్నుమూశారు. ప్రమాదంలో చిక్కుకున్న రమణబాబు కుమారుడు అఖిలేష్‌(9) జాడ ఇంకా తెలియరాలేదు. ఇదే ప్రమాదంలో  గాజువాకలో నివాసం ఉంటూ యాత్రకు వెళ్ళిన మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి, కుమార్తె హన్సిక మరణించిన సంగతి విదితమే. వారితో పాటు ప్రమాదంలో చిక్కుకున్న విఖ్యాత్‌రెడ్డి(6) అనే బాలుడి ఆచూకీ లభించలేదు. కుటుంబ పెద్దలు కనుమరుగైనా వారి వారసులైనా ప్రాణాలతో తిరిగి వస్తారన్న కోటి ఆశలతో వారి బంధువులు ఎదురుచూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement