
బాధితుడు మహ్మద్ బార్కర్ అలామ్
గురుగ్రామ్ : జైశ్రీరాం నినాదం చేయాలని గుర్తు తెలియని నలుగురు యువకులు టోపీ ధరించిన ఓ ముస్లిం యువకుడిపై దాడి చేశారు. ఆదివారం హర్యానా, గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు బిహార్‌కు చెందిన మహ్మద్ బార్కర్ అలామ్ (25).. గురుగ్రామ్‌లోని జకోబ్‌పురాలో నివాసం ఉంటున్నాడు. టోపీ ధరించిన అలామ్ ఆదివారం సదార్ బజార్ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు అడ్డుకున్నారు. టోపి ధరించడంపై అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాంతంలో టోపీలుపెట్టుకోవడం నిషిద్దమని, టోపీ తీసేసీ చేయిచేసుకున్నారు.
భారత్‌మతాకీ జై అని నినాదాలు చేయమని బలవంతం పెట్టగా.. అలామ్ వారు చెప్పినట్లు నినాదాలు చేశాడు. అంతటి ఆగని నిందితులు.. జై శ్రీరాం అనాలని గద్దించారు. దీనికి అలామ్ ఒప్పుకోకపోవడంతో తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై లాక్కెళ్లి మరి చితకబాదారు. ఏడ్చుకుంటూ సాయం చేయాలని వేడుకున్నానని, చివరకు తన కమ్యూనిటికి చెందిన వారు రావడంతో దుండగులు పరారయ్యారని అలామ్ తెలిపాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అలామ్.. నమాజ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.