
నిడమనూరు: కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నల్లగొండ జిల్లా నిడమనూరులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 237 మంది విద్యార్థినులు చదువుతుండగా.. వరుసగా మూడు రోజులపాటు సెలవులు రావడంతో 140 మంది విద్యార్థినులు ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు. శనివారం విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో బీరకాయ కూరను వడ్డించారు.
అయితే భోజనం చేసిన తర్వాత సుమారు 60 మంది విద్యార్థినులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కలుషిత ఆహారం తినడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస సమరద్ తెలిపారు. కొందరు పిల్లలు గ్యాస్ ప్రాబ్లమ్‌తో అస్వస్థతకు గురయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment