
ఆస్పత్రిలో శిశువు (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ : దేశరాజధానిలో మరో దారుణ సంఘటన. ఎనిమిది నెలల పసిగుడ్డుపై దగ్గరి బంధువే లైంగికదాడిచేశాడు. రక్తపుమడుగులో పడిఉన్న పాపను తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. పశ్చిమఢిల్లీలోని సుభాష్ నగర్‌లో చోటుచేసుకున్న ఈఘటన సంచలనంగా మారింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
పాపను ఆడిస్తానని వెళ్లి.. : అత్యాచారానికి గురైన పాప తల్లి గృహకార్మికురాలిగా, తండ్రి అడ్డా కూలీగా పనిచేస్తున్నారు. ఆదివారం పాప ఒంటరిగా ఉన్న సమయంలో వరుసకు బావయ్యే 28 ఏళ్ల యువకుడు ఇంట్లోకి వెళ్లాడు. అతిదారుణంగా లైంగికదాడిచేసి పారిపోయాడు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన తల్లి.. రక్తపుమడుగులో పడిఉన్న పాపను చూసి నిర్ఘాంతపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ‘పాపను కాస్త చూడమని వాళ్లమ్మ నాకు చెప్పివెళ్లింది. కొద్దిసేపటికి వాళ్ల బావ(నిందితుడు) వచ్చి పాపను నేను ఆడిస్తానని చెప్పాడు’’ అని పక్కింటావిడ పేర్కొన్నారు.
నిర్ధారించిన వైద్యులు : రక్తస్త్రావం ఎక్కువ కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే చిన్నారి అపస్మారక స్థితిలో ఉందని, ఎమర్జెన్సీ కేసుగా పరిగణించి చికిత్స అందించామని డాక్టర్లు చెప్పారు. పాపపై లైంగికదాడి జరిగిందని నిర్ధారించారు. ప్రాణాలు నిలపగలిగినప్పటికీ ఎప్పటికి కోలుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఆదివారం లైంగికదాడి అనంతరం పరారైన యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని, పోక్సో, ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని చెప్పారు. ఇదే ఢిల్లీలో గత అక్టోబర్‌లో 11 నెలల పాపపై లైంగికదాడి ఘటన అప్పట్లో కలకలంరేపింది.
విర్రవీగే సేనలు ఎక్కడ? : లైంగికదాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ఇప్పుడే ఆస్పత్రికి వెళ్లొచ్చాను. ఎనిమిది నెలల పసిగుడ్డుపై ఇంత దారుణంగా అత్యాచారం జరిగితే ఢిల్లీ ఎలా నిద్రపోగలుగుతున్నది? మన సమాజం ఇంత మొద్దుబారిందా, ఇది ఆడపిల్లల తలరాత అనుకోవాలా! వాళ్లేరి? మహిళల గౌరవాన్ని కాపాడుతామంటూ స్కూల్ బస్సులపై దాడులు చేసిన సేనలు ఎక్కడ?’’ అని మాలివాల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment