సాక్షి, బెంగళూరు : రాయచూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పద హత్య కేసు సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగించాలని గాయత్రి విశ్వకర్మ మహిళా సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జానకీ తారానాథ్ డిమాండ్ చేశారు. ఆమె సోమవారం అఖిల భారత్ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) తాలూకా సమితి, గాయత్రి విశ్వకర్మ తాలూకా మహిళా సంఘం నేతృత్వంలో చేపట్టిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. మహిళా కమిషన్ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 3600 మహిళలపై అత్యాచార కేసులు నమోదవడం శోచనీయన్నారు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు నిత్యం వేధింపులను అనుభవిస్తున్నారన్నారు. అందువల్ల విద్యార్థినులకు తగిన భద్రత కోసం ఇలాంటి కేసులను తక్షణమే విచారణ జరిపి నేరస్తులకు కఠిణ శిక్ష విధిస్తే విద్యార్థినులు, తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం వస్తుందన్నారు.
అనంతరం ఏబీవీపీ కార్యదర్శి యువరాజ్ మాట్లాడుతూ రాయచూరు ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక భాగంలోని అరణ్య ప్రాంతంలో ఈనెల 16న విద్యార్థిని మధు పత్తార్ అనుమానాస్పదంగా చనిపోయి శవం కుళ్లిపోయిన స్థితిలో లభించడం ఖండించదగ్గ విషయమన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కుమార్తె అదృశ్యమైందని ఇచ్చిన ఫిర్యాదును తీసుకోక పోవడం, సంఘటన వెలుగు చూసి 12 రోజులు అయినా ఇంక సంపూర్ణ విచారణ జరగక పోవడం, అత్యాచారం చేసి చంపారని పైకి కనబడినా ఇప్పటి వరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాకపోవడం, నేరస్తులపై చార్జిషీట్ వేసి కోర్టుకు హాజరు పరచకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించి నేరస్తులకు కఠిన శిక్ష పడేందకు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే రీతిలో రాబోయే రోజుల్లో రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాల్లో బంద్‌కు పిలుపునిచ్చి తీవ్ర నిరసన ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రికి తాలూకా తహసీల్దార్ ద్వారా మనవిపత్రాన్ని సమర్పించారు. విశ్వకర్మ సమాజం ముఖ్యనాయకులు, ఏబీవీపీ సంచాలకులు సంతోష్, వీరేశ్ కల్మండ్, విద్యార్థినులు చైత్రా, అశ్వని, సుచిత్రా, రాజేశ్వరి, సహనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment