ఏడీ ప్రభాకరరావు నుంచి స్వాధీనం చేసుకున్న నగదు ఏసీబీకి పట్టుబడ్డ జిల్లావిద్యాశాఖ ఏడీ ప్రభాకరరావు
తూర్పుగోదావరి, బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చే ఉపాధ్యాయులతో కిటకిటలాడే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం గురువారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారింది. విద్యాశాఖాధికారి రెండో అంతస్తులో పాఠశాల విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు సర్వీస్, వేతనాలు, తదితర పనులు పర్యవేక్షించే క్యాబిన్ ఎడమ వైపు భాగంలో ఉంటుంది. ఉదయం 12 గంటల సమయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడ ఉన్న అధికారులతో సహా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. కొన్నేళ్లుగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లంచం ఇవ్వనిదే ఫైలు కదలడం లేదని ఉపాధ్యాయులు మొత్తుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసే సాహసం ఒక్కరు కూడా చేయలేకపోయారు.
ఎట్టకేలకు గిరిజన ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయుడు సాహసించి ఓ అవినీతి అధికారిని ఏసీబీకి పట్టించాడు. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలో అడ్డతీగల మండలం కోనలోవ గ్రామ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారావు రెండు సంవత్సరాలు బీఈడీ విద్యను అభ్యసించడానికి 2018–20 సంవత్సరానికి గాను వేతనంతో కూడిన సెలవుకు ఆగస్టులో దరఖాస్తు చేసుకోగా డీఈఓ అనుమతి ఇస్తూ అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫైల్ పంపించారు. అప్పటి నుంచి ఆ ఫైల్‌ను క్లియర్ చేయకపోగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. చివరికి లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రూ.పదివేలు ఇవ్వడానికి గురువారం సిద్ధమయ్యాడు. ఆయన ఛాంబర్‌లో 11గంటల ప్రాంతంలో సొమ్ము ఇస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసిన డీఏస్పీ సుధాకర్ నేతృత్వంలోని ఏసీబీ అధికారులు విద్యాశాఖ ఏడీ ప్రభాకరరావును పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరరావును ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఏస్పీ తెలిపారు. ఇదే కార్యాలయంలో 2016లో సీనియర్ అసిస్టెంట్ చెక్కా నాగేశ్వరరావు ఇదే తరహాలో పట్టుబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment