హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ ప్రణాళికా విభాగం డైరెక్టర్ కె.పురుషోత్తంరెడ్డి విషయంలో ఏసీబీ అధికారులు తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ అతని బంధువులు హైకోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు. పురుషోత్తంరెడ్డి బావమరిది శ్రీనివాస్‌రెడ్డి, అల్లుడు నిపుణ్‌రెడ్డి ఏసీబీ అధికారులపై పిటిషన్లు దాఖలు చేయగా, ఆ జాబితాలో పురుషోత్తంరెడ్డి అత్త సుదేష్ణ కూడా చేరారు. తమ వ్యాపారాల్లో, వ్యక్తిగత జీవితంలో ఏసీబీ అధికారులు జోక్యం చేసుకుంటున్నారని, వారిని నిలువరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయ వాది పి.గంగయ్యనాయుడు వాదనలు వినిపిస్తూ పురుషోత్తంరెడ్డి ఆచూకీ చెప్పాలని, వ్యాపార వివరాలు చెప్పాలని పిటిషనర్ ఇంటికి పలుమార్లు ఏసీబీ అధికారులు వచ్చారని, పురుషోత్తంరెడ్డికి చెందిన కొన్ని ఆస్తులకు బినామీగా అంగీకరించాలని ఒత్తిడి తెచ్చారన్నారు.
తాము చెప్పినట్లు వినకపోతే తప్పు డు కేసులు బనాయించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారని నివేదించా రు. వ్యక్తిగత జీవితంలోనే కాక వ్యాపార వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. పిటిషనర్ ఇంటికి సీలు వేసి తాళం వేశారని, సీలు విషయాన్ని ముందుగా తెలియచేయలేదన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఏసీబీ మాన్యువల్‌ను అధికారులు తుంగలో తొక్కా రని తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడే చేయాలని ఏసీబీ అధికారులకు తెలిపారు. విచారించాలని భావిస్తే సీఆర్‌పీసీ సెక్షన్ 41ఎ కింద నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. పిటిషనర్ ఇంటికి వేసిన సీలును తొలగించాల ని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment