ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై | ACB Raids On Kakinada ASI House | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై

Published Thu, Nov 7 2019 10:40 AM | Last Updated on Thu, Nov 7 2019 10:40 AM

ACB Raids On Kakinada ASI House - Sakshi

సత్యనారాయణ చౌదరి(ఫైల్‌) ; స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలు

సాక్షి, కాకినాడ: కాకినాడలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో 1981లో చేరిన గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ చౌదరి 37 ఏళ్లలో రూ. కోట్లకు పడగెత్తారు. తన ఉద్యోగంతో పాటు అక్రమ ఆస్తులనూ అదే స్థాయిలో కూడబెడుతూ వచ్చారు. ఏఎస్సై స్థాయి అధికారి రూ. కోట్లకు పడగెత్తాడంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని వివిధ చోట్ల రాజకీయ నాయకులను మచ్చిక చేసుకొని, వారికి బినామీగా ఉంటూ రూ. కోట్లకు ఎగబాకినట్టు తెలుస్తోంది. రాత్రిపూట వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల వారిని తనిఖీల పేరుతో భారీగా సొమ్ములు వసూలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా పోలీసులు సైతం చెబుతున్నారు. ఆయన తాను అక్రమంగా సంపాదించిన సొమ్ముతో  పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం, స్థలాలు కొనుగోలు చేయడం, తన శాఖ అధికారులు, సిబ్బంది, బంధువులు, స్నేహితులతో వడ్డీ వ్యాపారం చేయించడం అలవాటుగా మార్చుకున్నాడు.

పొలం కొనుగోలుతో వివాదం
ఇటీవల  సామర్లకోట మండలం అచ్చంపేట–ఉండూరు మధ్యలో సత్యనారాయణ చౌదరి అరెకరం పొలం కొనుగోలు చేయడంతో వివాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు వ్యక్తులు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్టు చెబుతున్నారు.  కాకినాడ ట్రాఫిక్‌లో హెచ్‌సీగా పనిచేసిన సత్యనారాయణ చౌదరి పదోన్నతిపై పోర్టు పోలీస్‌ స్టేషన్‌ ఏఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. వారు ఐదు బృందాలుగా విడిపోయి సోదాలు జరిపారు. కాకినాడ జగన్నాథపురం మరిడమ్మపేటలోని సత్యనారాయణ చౌదరి ఇంటితో పాటు కాకినాడ రామారాపుపేట, రావులపాలెం, సామర్లకోటలోని రెండుచోట్ల, యానాం, గండేపల్లి ప్రాంతాల్లో ఏకకాలంలో బుధవారం సోదాలు నిర్వహించారు. ముందుగా కరప మండలం అరట్లకట్టకు పెదపూడికి  ఏసీబీ బృందాలు వెళ్లాయి. అరట్లకట్టలో అత్తగారి పేరుతో ఇల్లు, చర్చి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కాకినాడలో రెండుచోట్ల, సామర్లకోటలో రెండుచోట్ల, రావులపాలెంలోను సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు విలువైన ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించాయి.

రూ. మూడు కోట్లుగా చెబుతున్నా..
అధికారులు గుర్తించిన ఏఎస్సై అక్రమాస్తుల విలువ రూ. మూడు కోట్లుగా చెబుతున్నప్పటికీ బయట మార్కెట్‌లో చూస్తే వీటి విలువ రూ.10 నుంచి 15 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో జగన్నాథపురంలోని రెండంస్తుల భారీ భవనం, రామారావుపేటలో రెండంస్తుల డాబా ఇల్లు, సామర్లకోటలో రెండంతస్తుల భవనాలు రెండు, యానాంలో నాలుగంతస్తుల భవనంతో పాటు కేజీన్నర బంగారం, కేజీ వెండి, 100కు పైగా అప్పులు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు, ఎనిమిది ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలు, రూ. 3 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకులతో పాటు 10 బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఓ బ్యాంకులో రూ.19.75 లక్షలు ఉన్నట్లు బ్యాంకు పుస్తకాల పరిశీలనలో తెలిసింది. అంతేగాకుండా పెద్ద మొత్తంలో బ్యాంకు లాకర్లు ఉన్నాయని, వీటిల్లో కూడా పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు ఉండవచ్చని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సత్యనారాయణ చౌదరి భార్య వీరవెంకట వరలక్ష్మి పేరుతోనే ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు వెల్లడించారు. బ్యాంకులోని లాకర్లను కూడా తెరిపించనున్నట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, ఏసీబీ అధికారులు తిలక్, పుల్లారావు, సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు. 

ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ప్రస్థానం
సామర్లకోట మండలం ఉండూరుకు చెందిన సత్యనారాయణ చౌదరి 1981లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. కొంతకాలం తర్వాత సివిల్‌ కానిస్టేబుల్‌గా మారారు. కాకినాడ, సామర్లకోట, రావులపాలెం, పిఠాపురం పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహించారు. ఎక్కువ కాలం కాకినాడలోనే ఆయన ఉద్యోగం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వాధికారులకు అవినీతికి పాల్పడినా, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నా తమకు సమాచారం అందించాలని ఏసీబీ ఏఎస్పీ పీవీ రవికుమార్, డీఎస్పీ రామచంద్రరావు కోరారు.  ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో సత్యనారాయణ చౌదరిని అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement