
కేసు నమోదు చేస్తున్న డీఎస్పీ సుధాకర్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి గౌతమ్‌వరప్రసాద్ (లంచం తీసుకున్న డబ్బులు )
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: ఓ టింబర్ డిపో యాజమాని నుంచి కాకినాడ ఫారెస్ట్ సెక్షన్ అధికారి గౌతమ్ వరప్రసాద్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం రాజమండ్రి ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పిఠాపురానికిచెందిన సాయిదత్తా టింబర్ డిపో యజమాని చెక్కా పార్థసారధి కలపతో మంచాలు, వివిధ రకాల గృహోపకరణాలకు చెందిన వస్తువులు తయారు చేసి అమ్ముతుంటాడు. జనవరి 12న టింబర్ డిపోను మూసేసి తిరుపతి వెళ్లాడు. ఆ సమయంలో గౌతమ్ వరప్రసాద్ టింబర్ డిపో తనిఖీకి వెళ్లాడు. ప్రక్కనే ఉన్న పార్థసారధి బంధువులను అడిగి షట్టర్ తాళాలు తీయించాడు. వెంటనే షట్టర్ మూసివేసి తిరిగి తాళాలు ఇవ్వకుండా కాకినాడ వచ్చి తనను కలవాలని సూచించాడు.
విషయం తెలుసుకున్న పార్థసారధి కాకినాడ వార్ఫు రోడ్డులో ఉన్న ఫారెస్టు కార్యాలయానికి వచ్చి సెక్షన్ ఆఫీసర్ గౌతమ్‌వరప్రసాద్‌ను కలిసాడు. అనుమతులు లేకుండా కర్రతో వస్తువులు తయారు చేసి అమ్మడం నేరమని, కేసు పెడతామని, లేదంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాదాపుగా నెలరోజుల పాటు తాళాన్ని అతడి దగ్గరే ఉంచుకున్నాడు. చివరకు రూ. 25వేలకు బేరం కుదిరింది. మరోవైపు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వేధింపులు భరించలేక పార్థసారధి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఇరువురు చేసుకున్న ఒప్పందం మేరకు రమణయ్యపేట ఇందిరాకాలనీలో నివాసం ఉంటున్న గౌతమ్‌వరప్రసాద్‌కు రూ.20వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ. 20వేల నగదు స్వాధీనం చేసుకొని గౌతమ్ వరప్రసాద్‌ను కాకినాడ ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చి అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ దాడిలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం సుధాకర్, సీఐలు మోహనరావు, పుల్లారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment