పట్టుబడిన నిందితుడు భరత్‌మోహన్‌సింగ్
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రతిష్టాత్మకమైన వైద్య కళాశాల రిమ్స్‌లో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న భరత్‌మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధకశాఖ అధికారులు పంజా విసిరారు. అతను తన సీటులో కూర్చొని గురువారం బాధితుడు సురేష్‌కుమార్‌రెడ్డి వద్ద నుంచి నేరుగా రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన వివరాలను ఏసీబీ డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. అనంతపురం నర్సింగ్ కళాశాలలో ఆఫీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సి.సురేష్‌కుమార్‌రెడ్డి గత ఏడాది నవంబరు 21న కడప రిమ్స్‌కు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడుస్తున్నా వేతనంగానీ, పనిచేసే స్థానంగానీ ఇవ్వకుండా రిమ్స్‌లో ఏఓగా పనిచేస్తున్న భరత్‌మోహన్‌సింగ్ వేధింపులకు గురిచేశారు.
రూ. లక్ష ఇస్తేనే సురేష్‌కుమార్‌రెడ్డికి వేతనం ఇప్పించడంగానీ, స్థానం కేటాయించడంగానీ జరుగుతుందని ఏఓతోపాటు మరో ఇద్దరు అధికారులు తెగేసి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈనెల 6వ తేదీ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు తమ సీఐలు సుధాకర్‌రెడ్డి, రామచంద్ర, సిబ్బందితో కలిసి ఈ సంఘటనలో పాల్గొన్నారు. బాధితుడు సురేష్‌కుమార్‌రెడ్డి తాను ఒప్పందం కుదుర్చుకున్న రూ. 60 వేలు లంచం ఇచ్చేందుకు నేరుగా భరత్‌మోహన్‌సింగ్ కూర్చొన్న సీటు వద్దకు వెళ్లి ఇచ్చాడు. ఈ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు నేరుగా వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
స్థానం కేటాయించడంలోనూ కక్కుర్తి
రిమ్స్ ఆస్పత్రిలో పరిపాలన విభాగం అధికారిగా పనిచేస్తున్న భరత్‌మోహన్‌సింగ్ తనతోపాటు భవిష్యత్తులో పదోన్నతి లభించబోయే స్థాయి కలిగిన ఆఫీసు సూపరింటెండెంట్ క్యాడర్‌లో ఉన్న సురేష్‌కుమార్‌రెడ్డికి పనిచేసే సీటు కేటాయింపులోనూ, ట్రెజరీ నుంచి వేతనాన్ని మంజూరు చేయించడంలోనూ కక్కుర్తి పడ్డాడు. ఎల్‌పీసీ, ఎస్‌ఆర్ లాంటి రికార్డులను వెంటనే తీసుకొచ్చి ఇచ్చినా, అనేకసార్లు ప్రాధేయపడినా సురేష్‌కుమార్‌రెడ్డికి న్యాయబద్ధంగా చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేశాడు. దీంతో తీవ్ర ఆవేదన చెందిన సురేష్‌కుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరిపాలనాధికారి భరత్‌మోహన్‌సింగ్ తోపాటు మరో ఆఫీసు సూపరింటెండెంట్ మారుతిప్రసాద్, డైరెక్టర్ కూడా రూ. లక్ష ఇవ్వాలని పట్టుబట్టారని ఆరోపించారు. రూ. 60 వేలు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత నేరుగా డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని వివరించారు. అతనిని లోతుగా విచారించి ఈ సంఘటనలో హస్తమున్న వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు
వైఎస్సార్ జిల్లాలో జనవరి నెలలో 2వ తేదిన పెద్దముడియం వీఆర్వోగా పనిచేస్తున్న చంద్రమోహన్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙4న రైల్వేకోడూరుకు చెందిన శ్రీరాములు అనే సర్వేయర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙కడప నగరంలోని పాత రిమ్స్‌లో కార్మికశాఖ సహాయ కమిషనర్ పెంచలయ్య లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ∙ఎర్రగుంట్లలో రైల్వే హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవదానం రూ. 9 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
తాజాగా భరత్‌మోహన్‌సింగ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏసీబీ అధికారులను నేరుగా కలవాలన్నా, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలన్నా డీఎస్పీ నాగరాజు (94404 46191), సీఐలు సుధాకర్‌రెడ్డి (94404 46100), రామచంద్ర (94906 11024), కార్యాలయం (08562–244637)లో సంప్రదించాలని డీఎస్పీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment