తాడిహత్నూర్ పరీక్ష కేంద్రం వద్ద సీఐ
నార్నూర్(ఆసిఫాబాద్): మండలంలోని తాడిహత్నూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రం నుంచి సోమవారం పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–1 లీక్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరీక్ష కేంద్రంలోని రూమ్ నంబర్–01 నుంచి ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా లీకైన విషయంపై ఎంఈవో ఆశన్న ఫిర్యాదు మేరకు సీఎస్, డీవో, సిట్టింగ్ స్కాడ్‌లతోపాటు ఇన్విజిలేటర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సీఐ హనోక్ తాడిహత్నూర్ పరీక్ష కేంద్రానికి వెళ్లి పనిచేస్తున్న సిబ్బందితోపాటు వర్కర్లను సైతం విచారించారు. బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఫొటోలు తీశారా? లేక విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సెల్‌ఫోన్‌లో ఫొటోలు తీసి బయటకు పంపారా? ఉదయం ఏ సమయంలో ప్రశ్నపత్రం బయటకు వచ్చింది? అనే కోణంతో విచారించారు. పక్కనున్న ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు.
పేపర్ లీక్ కారణమైన నలుగురిని గత రెండు రోజులుగా పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. వీరి కాల్‌డేటా కూడా సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీక్ వ్యవహరంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. ప్రశ్న పత్రం లీక్ కావటానికి కారకులు ఎవరో త్వరలో తేలిపోతుందన్నారు. నార్నూర్, తాడిహత్నూర్ రెండు పరీక్ష కేంద్రాల వద్ద బయట వ్యక్తులు ఎవరు లోనికి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. కాగా ఈ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఇంగ్లిష్–02 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment