యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వినయ్‌వర్మ
హైదరాబాద్: యాక్టింగ్ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. అందుకు ‘అన్ని విధాలుగా’సిద్ధంగా ఉండాలని ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారూ తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. రెండు రోజుల క్రితం హిమయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో బుధవారం వెలుగులోకి వచ్చింది. కవాడిగూడకు చెందిన అచ్నిత్ కౌర్‌కు యాక్టింగ్ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్‌నగర్‌లోని ‘సూత్రధార్’ఇనిస్టిట్యూట్‌లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్‌వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతులను లైన్‌లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్ ఆదేశించాడు. దీనికి అచ్నిత్ కౌర్ నిరాకరించింది. దుస్తులు విప్పితేనే యాక్టింగ్ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి యాక్టింగ్ శిక్షణ తనకు అవసరం లేదంటూ ఆమె ఇనిస్టిట్యూట్ నుంచి బయటకు వచ్చి షీ టీమ్‌ను ఆశ్రయించింది.
చుక్కలు చూపించిన పోలీసులు...
తనకు జరిగిన అన్యాయాన్ని అచ్నిత్ కౌర్ షీ టీమ్‌కు వివరించగా.. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఎఫ్‌ఐఆర్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో బాధితురాలు ఈ నెల 15న నారాయణగూడ పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినా స్పందించలేదు. మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన ఆమె నుంచి రాత్రి 8 గంటల వరకూ ఫిర్యాదు తీసుకోలేదు. తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు బాధితురాలు మీడియాకు వివరించింది. అచ్నిత్ కౌర్ మీడియా ముందుకు రావడంతో.. ఇదే ఇనిస్టిట్యూట్‌లో చేరిన మరికొంత మంది కూడా తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు సమాచారం. ఇన్నిరోజులు యాక్టింగ్‌పై ఉన్న అభిమానంతో మౌనంగా ఉన్నామని ఫోన్‌లో పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటిదాకా ఇక్కడ యాక్టింగ్ నేర్చుకున్న వారు పడిన ఇబ్బందులపై ఇన్‌స్పెక్టర్ రమేశ్‌కుమార్ వివరాలు సేకరిస్తున్నారు.
అన్నింటికీ ఇష్టపడే వస్తున్నారు: వినయ్‌వర్మ
ఈ ఘటనపై నిలదీసేందుకు సదరు ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఛాయదేవి, సెన్సార్ బోర్డ్ సభ్యురాలు భారతికి వినయ్‌వర్మ షాకిచ్చాడు. ‘గత 20 ఏళ్లుగా ఇనిస్టిట్యూట్‌ని నడుపుతున్నాను. బట్టలిప్పాల్సిందేనని ముందే చెబుతా. అందుకు వారు అంగీకరించే వస్తారు. మీరెందుకు హడావుడి చేస్తున్నారు’అంటూ దబాయించాడు. ఈ ఇనిస్టిట్యూట్‌ని మూసివేయాలని, వినయ్‌వర్మని వెంటనే అరెస్ట్ చేయాలని ఛాయదేవి, భారతి డిమాండ్ చేశారు.
మరింత విచారణ చేస్తున్నాం: అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి
వినయ్‌వర్మ వ్యవహారశైలిపై లోతుగా విచారణ జరుపుతున్నామని అబిడ్స్ ఏసీపీ బిక్షంరెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి ప్రారంభించిన శిక్షణలో ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులు చేరినట్లు వివరించారు. 14న వీరందరినీ దుస్తులు విప్పి యాక్టింగ్ చేయండనడంతో అచ్నిత్ కౌర్ వ్యతిరేకించిందన్నారు. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేయడంతో వినయ్‌వర్మపై సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment