ఏఈఈ నగేష్‌ అనుమానాస్పద మృతి | AEE Nagesh Suspicious death in Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఏఈఈ నగేష్‌ అనుమానాస్పద మృతి

Published Fri, Mar 29 2019 1:28 PM | Last Updated on Fri, Mar 29 2019 1:28 PM

AEE Nagesh Suspicious death in Visakhapatnam - Sakshi

సంఘటన స్థలిలో ఏఈఈ నగేష్‌ మృతదేహం

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): స్వచ్ఛ భారత్‌ మరుగుదొడ్ల నిధులు గోల్‌మాల్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జీవీఎంసీ ఏఈఈ సనపల నగేష్‌(52) మృతి సంచలనంగా మారింది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై తేలడం... శరీరంపై  గాయాలుండడంతో ఎవరో హత్య చేశారని భార్య, బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మృతుని కారులో లభించిన సూసైడ్‌ నోట్‌లో స్రైబర్‌ క్రైం ఎస్‌ఐ రవికుమార్‌ వేధిస్తున్నాడని నగేష్‌ ఆరోపిస్తున్నట్లు ఉండడం గమనార్హం. స్థానికులు, కంచరపాలెం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) సనపల నగేష్‌(52) మాధవదార సీతన్న గార్డెన్స్, నరసింహనగర్‌లో కుటుంబ సభ్యులతో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో చిన్న పని ఉందని నగేష్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తర్వాత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇంతలో గురువారం ఉదయం మురళీనగర్‌ బృందావన్‌ పార్క్‌ సమీపంలో రజకుల దుకాణం వద్ద ఏఈఈ నగష్‌ మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.మృతదేహంపై గాయాలుండడంతో ఎవరో కొట్టి చంపి ఉంటారని నగేష్‌ భార్య, ఇతర కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇక్కడి రజకుల దుకాణం వద్ద బల్లపై వాటర్‌ బాటిల్, కూల్‌డ్రింక్‌ సీసా ఉండడంతో... ఎవరితోనైనా కలిసి మద్యం సేవించారా..? లేక విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అన్న అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మృతుని ఇంటి వద్ద కారులో సూసైట్‌ నోట్‌ లభించడం... అందులో సైబర్‌ క్రైం ఎస్‌ఐ రవికుమార్‌ వేధిస్తున్నారని ఆరోపించడంతో మరింత గందరగోళం నెలకొంది. కంచరపాలెం సీఐ భవానీ ప్రసాద్, ఎస్‌ఐ మురళి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు ఆధారాలు సేకరించారు. మృతుని ముఖంపై గాయాలున్నట్లు గుర్తించామని, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. సైబర్‌ క్రైం ఎస్‌ఐ నల్లి రవికుమార్‌ వేధిస్తున్నాడని సూసైడ్‌ నోట్‌లో చేసిన ఆరోపణలపై కూడా వాస్తవాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు. నగేష్‌ మృతి విషయం తెలుసుకున్న జీవీఎంసీ ఉన్నతాధికారులు, సహోద్యోగులు ఘటనా స్థలానికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. నగేష్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు కిరణ్‌ కుమార్‌ బీటెక్‌ చదువుతున్నాడు. కుమార్తె తేజ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది.  

రూ.55వేలు కాజేశారని కేసు
స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు 2016లో చేపట్టారు. ఆ సమయంలో జోన్‌ – 6లో ఏఈగా నగేష్‌ విధులు నిర్వహించారు. లబ్ధిదారుల సర్వే కోసం సహాయకులుగా కొందరు కళాశాల విద్యార్థులు వచ్చారు. అయితే వారు కొన్నాళ్లు ఇక్కడ పనిచేసి వెళ్లిపోయారు. ఆ తరువాత వారే ఏఈ నగేష్‌కు కేటాయించిన యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌ సాయంతో జోన్‌ – 1లో కొందరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించినట్లుగా చూపించి సుమారు రూ.55వేలు కాజేసినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. అనంతరం దీనిపై జీవీఎంసీ కమిషనర్‌ హరినారాయణన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో ఈ కేసు సైబర్‌ క్రైమ్‌కు బదిలీ అయిది. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ నెల 25న 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు నగేష్‌కు జారీ చేశారు. దీంతో విచారణకు హాజరైన నగేష్‌కు బెయిల్‌ మంజూరైనట్లు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను విచారించకుండా తననే ఇరికించారని నగేష్‌ తన సూసైడ్‌ నోట్‌లో సైబర్‌ క్రైం ఎస్‌ఐ నల్లి రవికుమార్‌పై ఆరోపణలు చేశారు.

నన్ను ఇరికించాలని వేధిస్తున్నారు...
మృతుడు నగేష్‌ కారులో ఒక సూసైడ్‌ నోట్‌ దొ రికింది. అందులో ఏముందంటే... ‘‘స్వచ్ఛభారత్‌లో భాగంగా ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొ డ్లు నిర్మించే పథకంలో సహాయకులుగా కొందరు విద్యార్థులు నాతో కలిసి పనిచేశారు. వారు పలుమార్లు నా ఫోన్‌ తీసుకుని వినియోగించారు. అనంతరం కొద్ది రోజుల తర్వాత వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో జాబితాలో లేని వ్యక్తుల పేరున బిల్లులు మంజూరైనట్లు గుర్తించిన జీవీఎంసీ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు నన్ను పిలిచి విచారించారు. తనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నట్లు తెలిసిందని తెలిపారు. వారిలో సంపత్, అజయ్‌ ఉన్నారన్నారు. ఇందులో కీలకమైన సందీప్‌ను పిలిపించలేదు. సైబర్‌ క్రైమ్‌ ఎస్‌ఐ నల్లి రవికుమార్‌ ఏ1, ఏ2ల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నన్ను ఇరికించేందుకు యత్నిస్తున్నాడు... ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని’’ కోరారు. ఈ సూసైడ్‌ నోటు బుధవారం రాసినట్లు సంతకం చేసి, తేదీని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement