
హైదరాబాద్: అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ ఇమ్మిడి సదాశివ వరప్రసాద్ సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. విజయవాడ దుర్గాపురం ప్రాంతానికి చెందిన సదాశివ వరప్రసాద్(69) అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలో ఉంటున్న మేనల్లుడు లావణ్యకుమార్ వద్దకు సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి రైళ్లో బయలుదేరారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన ఆయన పార్సిల్ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళుతూ రోడ్డు మీద పడిపోయారు. వెంటనే స్థానికులు గమనించి ‘108’కు సమాచారం అందించారు. ‘108’సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆయన మరణించినట్లు చెప్పారు.
మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సాయంత్రం విషయం తెలుసుకున్న బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. నెలన్నర క్రితం ఆయనకు ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు గుండెపోటుతోనే మరణించారని, పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని అప్పగించాలన్నారు. అయితే, పోలీసులు దీనికి ఒప్పుకోలేదు. మృతుడు అగ్రి గోల్డ్ సంస్థ కేసులో నిందితుడిగా ఉండటంతో పోస్టుమార్టం తర్వాతనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి వారికి స్పష్టం చేశారు.