
సాక్షి,న్యూఢిల్లీ: నూతన సంవత్సర వేడుకలు, పండుగ సీజన్ నేపథ్యంలో ఉగ్ర ముప్పు పొంచిఉందని రాష్ట్ర పోలీస్ చీఫ్‌లకు సమాచారం అందింది. మరోవైపు విమానాశ్రాయాల్లో హై అలర్ట్‌ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, వివిధ పండుగలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే క్రమంలో ఉగ్రవాదులు, సంఘవ్యతిరేక శక్తులు పేట్రేగే ప్రమాదం నెలకొందని, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అన్ని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేసింది.
దేశంలో ఉగ్రదాడులపై ఈ ఏడాది పాక్‌కు చెందిన ఉగ్రసంస్థలు ఇప్పటికే సంకేతాలు పంపాయని, ఐఎస్ ప్రేరేపిత సంస్థలు పలు దేశాల్లో భీకర దాడులతో చెలరేగాయని గుర్తుచేసింది. ఉగ్రమూకలు ఆత్మాహుతి దాడులతో జనసమ్మర్థ ప్రాంతాలపై విరుచుకుపడతారని బీసీఏఎస్ చీఫ్ రాజేష్ కుమార్ చంద్ర ఈ నోట్‌లో హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాల పోలీస్ చీఫ్‌లనూ బీసీఏఎస్ అప్రమత్తం చేసింది.
విమానాశ్రయాల టెర్మినల్ బిల్డింగ్ లోపలికి ప్రవేశంపై కఠిన నియంత్రణలు పాటించాలని, నిర్వహణా ప్రాంతం, విమానయాన ప్రాంగణంలో అడుగడుగునా నిఘాను తీవ్రతరం చేయాలని సూచించింది. కారు బాంబు దాడులను నివారించేందుకు కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేయాలని పేర్కొంది. క్విక్ రియాక్షన్ టీమ్‌లు, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సూచించింది.