టిరానా : తన బంధువుల కుటుంబంలోని 8 మందిని దారుణహత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతడు సైకోలా మారి ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హత్యల ఉదంతం అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకుంది.
రిడ్వాన్ జైకాజ్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన బంధువుల కుటుంబంపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో రాజధాని టిరానాకు 90 కిలోమీటర్ల దూరంలోని రెస్యూలాజ్ అనే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ఏకే-47తో వెళ్లాడు. ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తన తాతను ఆపై ఆమె భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ ఫ్యామిలోని మరో ఆరుగురు సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిందితుడి చేతిలో హత్యకు గురైన వారిలో 9 ఏళ్ల చిన్నారి, ఓ టీనేజీ బాలిక సహా ముగ్గురు మహిళలు ఉన్నారు.
కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిడ్వాన్ జైకాజ్ ఫొటోను చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లకు పంపించారు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతడు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 24 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు ఆ కరడుగట్టిన నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment