
రైల్వేగేట్: నగరంలోని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓ వైన్ షాపు నుంచి అక్రమంగా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు మద్యం బాటిళ్లు రవాణా అవుతున్నట్లు సమాచారం. చంద్రాపూర్ జిల్లాలో మద్య నిషేదం ఉండడంతో అక్కడి నుంచి వచ్చిన కొందరు వరంగల్‌లోని వైన్ షాపుల నుంచి మద్యం (90 ఎంఎల్, క్వార్టర్ ) బాటిళ్లను వారి జిల్లాకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి చంద్రాపూర్ నుంచి వచ్చిన వారు వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని వైన్స్‌లో నాలుగు బ్యాగుల్లో మద్యం బాటిల్స్ తీసుకుని వరంగల్ శివనగర్ వైపు ఉన్న రైల్వే ప్లాట్ ఫామ్‌లో ఉండగా రైల్వే పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది. సుమారు రూ.40 వేల విలువగల మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. గతంలో చంద్రాపూర్ నుంచి మద్యం కోసం వచ్చే వారు కాగజ్‌నగర్, మంచిర్యాల ప్రాంతాల నుంచి ఎక్కువగా మద్యం రవాణా చేస్తుండేదని, అక్కడ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వారంతా వరంగల్ బాట పట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment