తాగడానికి డబ్బులు ఇవ్వలేదని... | Alcoholic Murdered Wife For Denying Money In Vizianagaram | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇవ్వలేదని...భర్త కిరాతకం..!

Published Tue, Apr 30 2019 12:14 PM | Last Updated on Tue, Apr 30 2019 12:24 PM

Alcoholic Murdered Wife For Denying Money In Vizianagaram - Sakshi

నిందితుడిని కర్ర స్తంభానికి కట్టివేసిన గ్రామస్తులు, ఇన్‌సెట్లో మృతిచెందిన చిలకమ్మ

జీవితాంతం తోడుంటానంటూ అగ్నిసాక్షిగా తాళి కట్టాడు.. మద్యానికి బానిసగా మారాడు.. భార్యను చిత్రహింసలకు గురిచేశాడు.. కూలి డబ్బులతో పాటు పంట విక్రయించగా వచ్చిన సొమ్మును మద్యంకే పోశాడు. చివరకు తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కడతేర్చిన విషాద ఘటన మక్కువ మండలం మూలవలసలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.   

మక్కువ: మద్యం వ్యసనం...  పేద, మధ్యతరగతి కుటుంబాలను చిత్తుచేస్తోంది. ఆస్తులు అమ్మించేస్తోంది. ఆర్థిక కష్టాల్లోకి నెట్టేస్తోంది. చివరకు ప్రాణాలను తీస్తోంది. దీనికి మక్కువ మండలం మూలవలసలో ఆదివారం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. తాగేందుకు డబ్బులు ఇవ్వలేని కట్టుకున్న భార్యనే కత్తితో కడతేర్చాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన  వివరాల ప్రకారం... చిలకమ్మ(34) భర్త ఎరకయ్య ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తాగిన మందు చాలలేదని, జీడిపిక్కలు విక్రయించగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని భార్య చిలకమ్మను వేధించాడు. దీనికి ఆమె నిరాకరించి ఇంటిబయటకు వచ్చింది.

సీసీరోడ్డుపై కూర్చొని ఆమె చుట్ట చుట్టుకుంటుండగా ఇంటిలో ఉన్న కత్తిని తీసుకొని వచ్చి, మెడపై, నుదుటపై కత్తితో వేటువేశాడు. దీంతో అక్కడికక్కడే నెత్తురు చిమ్ముతూ చిలకమ్మ కుప్పకూలిపోయింది. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మరణించింది. పరారయ్యేందుకు ఎరకయ్య ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని కర్ర స్తంభానికి కట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మన్యప్రాంతం కావడం, అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు పోలీసులకు అవకాశంలేకపోవడంతో  సోమవారం తెల్లవారుజామున ఎస్‌ఐ కె.కృష్ణప్రసాదు, ప్రొహిబిషన్‌ ఎస్‌ఐ షేక్‌ శంకర్‌లు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సీహెచ్‌ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ప్రాణాలు తీస్తున్న నాటుసారా... 
మన్యం పల్లెల్లో నాటుసారా ఏరులై ప్రవహిస్తోంది. గిరిజనులు సారా మత్తుకు అలవాటుపడుతున్నారు. పనసభద్ర పంచాయతీకి ఒడిశా రాష్ట్రం సమీపంలో ఉండడంతో గిరిజన గ్రామాల్లోకి నాటుసారా సరఫరా అవుతోంది. ఓ వైపు ఎక్సేజ్‌ అధికారులు దాడులు నిర్వహించి, ఎప్పటికప్పుడు నాటుసారా విక్రయించకుండా అదుపుచేస్తున్నా పరిస్థితి షరామామూలే అవుతోంది. ఎక్సైజ్‌ కార్యాలయం సాలూరులో ఉండడంతో నిత్యం దాడులు జరగడంలేదు. ఇది సారా వ్యాపారులకు కలిసొస్తోంది. నాటుసారా మత్తు ఎక్కువగా ఉండడంతో పాటు, తక్కువ ధరకు దొరకడంతో గిరిజనులు నాటుసారాకు బానిసలవుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement