సాక్షి, అనంతపురం: కట్టుకున్న భర్తను హతమార్చేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసింది. అయితే పోలీసులు ఆ కుట్రను భగ్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అనంతపురంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న నిసారుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం గౌసియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నిసారుద్దీన్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసినా ససేమిరా అన్నాడు. దీంతో 2016లో గౌసియా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త ఉద్యోగంతో పాటు, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్‌పై కన్నేసింది. భర్తను హత్య చేయిస్తే కారుణ్య నియామకం కింద ఉద్యోగంతో పాటు బీమా సొమ్ము మొత్తం తనకే చెందుతుందనే దురుద్దేశంతో హత్యకు వ్యూహం పన్నింది.
రూ.10 లక్షల సుపారీ
ఇందులో భాగంగా అనంతపురంలోనే నివాసం ఉంటున్న అఖిల భారత ప్రగతి శీల మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్‌ను సంప్రదించింది. తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్‌తో గౌసియా ఒప్పందం చేసుకుంది. డబ్బు కోసం గౌసియా తన తల్లి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించింది. వచ్చిన డబ్బులో రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా నిర్మలమ్మకు చెల్లించింది. నిసారుద్దీన్‌ను హత్య చేసేందుకు నిర్మలమ్మ, కులశేఖర్ గార్లదిన్నెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణారెడ్డితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.1.80 లక్షలు చెల్లించారు. రమణారెడ్డి ఈ బాధ్యతను తాడిపత్రి పోలీసుస్టేషన్‌లో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న కడపకు చెందిన మురళీకృష్ణారెడ్డికి అప్పగించాడు. అతనికి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పాడు. మురళీ కృష్ణారెడ్డి, నాగేంద్రుడు, మరో వ్యక్తి కలిసి నిసారుద్దీన్ ఇంటి వద్ద హత్యకు రెక్కీ నిర్వహించారు.
అయితే వీరు తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కుట్ర బయటపడింది. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా.. నిర్మలమ్మ, కులశేఖర్, మురళీకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు, కారం పొడి ప్యాకెట్లు, రూ. 40 వేల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment