gousia begum
-
భర్త హత్యకు భార్య స్కెచ్, 10 లక్షల సుపారీ
సాక్షి, అనంతపురం: కట్టుకున్న భర్తను హతమార్చేందుకు ఓ భార్య పక్కా స్కెచ్ వేసింది. అయితే పోలీసులు ఆ కుట్రను భగ్నం చేసిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం అనంతపురంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న నిసారుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం గౌసియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. నిసారుద్దీన్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లయిన కొంత కాలానికే వేరు కాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసినా ససేమిరా అన్నాడు. దీంతో 2016లో గౌసియా పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె భర్త ఉద్యోగంతో పాటు, అతని పేరిట ఉన్న ఇన్సూరెన్స్‌పై కన్నేసింది. భర్తను హత్య చేయిస్తే కారుణ్య నియామకం కింద ఉద్యోగంతో పాటు బీమా సొమ్ము మొత్తం తనకే చెందుతుందనే దురుద్దేశంతో హత్యకు వ్యూహం పన్నింది. రూ.10 లక్షల సుపారీ ఇందులో భాగంగా అనంతపురంలోనే నివాసం ఉంటున్న అఖిల భారత ప్రగతి శీల మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్‌ను సంప్రదించింది. తన భర్తను హత్య చేస్తే రూ.10 లక్షలు ఇస్తానని నిర్మలమ్మ, ఆమె భర్త కులశేఖర్తో గౌసియా ఒప్పందం చేసుకుంది. డబ్బు కోసం గౌసియా తన తల్లి పేరిట ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించింది. వచ్చిన డబ్బులో రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా నిర్మలమ్మకు చెల్లించింది. నిసారుద్దీన్‌ను హత్య చేసేందుకు నిర్మలమ్మ, కులశేఖర్ గార్లదిన్నెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమణారెడ్డితో రూ.5 లక్షలకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ.1.80 లక్షలు చెల్లించారు. రమణారెడ్డి ఈ బాధ్యతను తాడిపత్రి పోలీసుస్టేషన్లో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న కడపకు చెందిన మురళీకృష్ణారెడ్డికి అప్పగించాడు. అతనికి రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పాడు. మురళీ కృష్ణారెడ్డి, నాగేంద్రుడు, మరో వ్యక్తి కలిసి నిసారుద్దీన్ ఇంటి వద్ద హత్యకు రెక్కీ నిర్వహించారు. అయితే వీరు తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో తాడిపత్రి రూరల్ సీఐ సురేష్‌బాబు, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య కుట్ర బయటపడింది. ప్రధాన నిందితురాలు గౌసియా పరారీలో ఉండగా.. నిర్మలమ్మ, కులశేఖర్, మురళీకృష్ణారెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు, కారం పొడి ప్యాకెట్లు, రూ. 40 వేల నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
అమ్మా.. క్షమించండి!
ఏలూరు : ‘అమ్మా.. క్షమించండి. ఏమైనా బాధపెట్టి ఉంటే వెరీ వెరీ సారీ’.. ఈ మాటలు సామాన్య వ్యక్తులు పలికినవి కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగంను ఉద్దేశించి అన్న మాటలివి. జేడీ గౌసియాబేగం అత్త శనివారం మృతి చెందారు. అయితే, కొత్త ప్రభుత్వంలో మొదటిసారిగా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించడంతో ఆమె విధులకు హాజరయ్యారు. సమావేశం మొదట్లో వ్యవసాయ శాఖపై సమీక్షలో నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఎమ్మెల్యేలు సూచించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. అనంతరం ఆమె అత్త మృతి చెందిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఉప ముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ విభాగంపై సమీక్ష ముగిసిన వెంటనే.. గౌసియా బేగంకు సమావేశం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ‘అమ్మా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అని ఉప ముఖ్యమంత్రి కోరారు. -
భార్యపై కత్తితో దాడిచేసిన భర్త అరెస్ట్
హైదరాబాద్: భార్యపై కత్తితో దాడికి పాల్పడిన భర్తను రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన సయ్యద్ అంజద్(35), గౌసియా బేగం(30)లు దంపతులు. 12 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. హోటళ్లల్లో పని చేస్తూ సయ్యద్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. భార్య భర్తల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరగడంతో అంజద్ పలుమార్లు భార్యపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గత నాలుగు నెలలుగా భార్యభర్తల మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో వేరుగా ఉంటున్నారు. ఈ నెల 5వ తేదీన గౌసియా బేగం యాకుత్‌పురా ఇమామ్‌బడా ఆషూర్ఖానా వద్ద నివాసముండే సోదరి పర్వీన్ బేగం ఇంటికి వచ్చింది. అదే రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో అక్కడికి వచ్చిన అంజద్ భార్యతో గొడవ పడి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన గౌసియా బేగంను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం జరిగిన దాడిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త సయ్యద్ అంజద్‌ను బుధవారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.