
ఏలూరు : ‘అమ్మా.. క్షమించండి. ఏమైనా బాధపెట్టి ఉంటే వెరీ వెరీ సారీ’.. ఈ మాటలు సామాన్య వ్యక్తులు పలికినవి కాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ జేడీ గౌసియా బేగంను ఉద్దేశించి అన్న మాటలివి. జేడీ గౌసియాబేగం అత్త శనివారం మృతి చెందారు. అయితే, కొత్త ప్రభుత్వంలో మొదటిసారిగా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించడంతో ఆమె విధులకు హాజరయ్యారు. సమావేశం మొదట్లో వ్యవసాయ శాఖపై సమీక్షలో నాయకులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. ఎమ్మెల్యేలు సూచించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నారు. అనంతరం ఆమె అత్త మృతి చెందిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఉప ముఖ్యమంత్రి సుభాష్‌చంద్రబోస్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ విభాగంపై సమీక్ష ముగిసిన వెంటనే.. గౌసియా బేగంకు సమావేశం నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ‘అమ్మా.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి’ అని ఉప ముఖ్యమంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment