వరిగడ్డిని బండిల్‌గా చుట్టే యంత్రాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
పెనుగొండ: గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలన వల్లే రైతులు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారని, తక్షణం చెల్లించాల్సిన రూ.37వేల కోట్ల బకాయిల భారం మోపి ఆ సర్కారు గద్దె దిగిందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంత్యుత్సవం సందర్భంగా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా స్థానంలో జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలన వల్ల ప్రజలు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మిన పంటకు రైతులకు డబ్బులు అందకపోవడానికి ప్రధాన కారణం గత సర్కారు నిధులు మళ్లించడమేనని బోస్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.12,000 కోట్లు విడుదల చేస్తే, దానిలో రూ.4,800 కోట్లు పసుపు కుంకుమకు, ఇతర పథకాలకు మళ్లించిందని విమర్శించారు. ఇప్పుడు ఇదే రైతులకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు సున్నా వడ్డీకి రుణాలను ఎన్టీఆర్ ప్రారంభిస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి మరింత మందికి వాటిని అందించారని గుర్తుచేశారు. ఈ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేయకుండా రద్దు చేసిందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రతి పార్టీ తిరుపతి వెంకటేశ్వరస్వామి తరువాత ఎక్కువగా డాక్టర్ స్వామినాథన్ పేరునే తలుస్తుందని, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలు మరిచిపోతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకు లాభసాటి ధర కల్పించేందుకు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. రైతు సంక్షేమం కోసం ఆయన ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉంటే, 45 లక్షల మంది కౌలు రైతులే ఉన్నారని, వీరి రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని పేర్కొన్నారు. చెరుకు సాగు పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు
ప్రజలు తినే ధాన్యాన్నే సాగు చేయాలి
ప్రజలు తినే వరి వంగడాలనే రైతులు సాగు చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు. తినడానికి పనికి రాని వరివంగడాల రూపకల్పన వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డారు. మార్టేరులో రూపొందించిన స్వర్ణ రకాన్ని జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా పండిస్తున్నారని, అటువంటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించాలని సూచించారు. ఇక నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని వివరించారు. దీనికోసం జిల్లానే పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని చెప్పారు. జిల్లాలో రొయ్యల చెరువులవల్ల తాగునీరు కలుషితమైందని, కొత్తగా రొయ్యల చెరువులకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. విజ్జేశ్వరం నుంచి నేరుగా ప్రతి గ్రామానికీ గోదావరి జలాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. జిల్లాలో సాగునీటి సమస్య మూడునాలుగు రోజుల్లో పరిష్కారమవుతుందని స్పష్టం చేశారు. రైతులు, కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందడుగు వేయాలని సూచించారు. రైతు సంక్షేమానికి కృషి చేస్తామని కలెక్టర్ రేవు ముత్యాల రాజు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment